Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంనేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీం రద్దుచేయాలి

నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీం రద్దుచేయాలి

– మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం
– ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కులను సాధించుకుందాం : రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ-ముషీరాబాద్‌

”నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీం రద్దు కోసం పోరా డాలి.. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కులను సాధించుకుందాం.. మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం..” అని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి అమల్లోకి తీసుకొస్తోందన్నారు. కార్మిక చట్టపరమైన కనీస హక్కులను హరించే ఈ నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులు హక్కులు కోల్పోవడంతో పాటు ట్రేడ్‌ యూనియన్లు లేకుండా చేసే కుట్ర దాగి ఉందని చెప్పారు. జీతాల పెంపుదలకు బేరసారాల హక్కు లను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ రద్దుకు రిజిస్టర్‌లకు విస్తృత అధికారాలు కల్పించ బడతాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తున్న తనిఖీ వ్యవస్థను తొలగిస్తారన్నారు. కొత్త ట్రేడ్‌ యూనియన్లు నమోదు ప్రక్రియపై తీవ్ర ఆంక్షలు విధించబడతాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపు పెంచాలని, ఈ పథకాన్ని పట్టణ ప్రాంతా లకు విస్తరించాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ మ్యానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ వంటి చర్యలతో ప్రభుత్వరంగ సంస్థలు బలహీన పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ వివరించారు. ప్రభుత్వ రంగాన్ని ఆధారం చేసుకుని విదేశీ, స్వదేశీ బహుళ జాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నా యన్నారు. ప్రభుత్వ రంగం అంటే కేవలం ఆయా సంస్థల్లో పని చేసే కార్మికుల ప్రయోజనాలు మాత్రమే కాదని, ప్రభుత్వ రంగం దేశం మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు భద్రత లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తుందని తెలి పారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రభు త్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ విధానంతో ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్లను తీసు కొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు -2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలన్నారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపరుస్తోందన్నారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ వంటి చర్యలతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడానికి పూనుకుంటుందన్నారు. మేజర్‌ పోర్టు చట్టాన్ని ఆమోదించి బీమా కంపెనీలలో ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచిందని, 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను ఏడు కంపెనీలుగా మార్చి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించిందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాలపై దాడి చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి, ధన వంతులు, కార్పొరేట్‌ వర్గాల ఆదాయంపై సంపద ట్యాక్స్‌ పెంచి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీడీఏ నిర్ణయించాల న్నారు. అసంఘటిత రంగ కార్మికులకు యూనివర్సల్‌ సోషల్‌ సెక్యూరిటీ స్కీంను ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడావత్‌ ధర్మానాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img