నవతెలంగాణ-హైదరాబాద్: చీఫ్ జస్టిస్ కార్యాలయం పోస్టాఫీసు కాదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి దేశం పట్ల బాధ్యత ఉంటుందని జస్టిస్ యశ్వంత్ వర్మ నగదు వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తనపై వచ్చిన ఆరోపణలను విచారించిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కమిటీ నివేదికను జస్టిస్ వర్మ సవాలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిV్‌ాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు అంతర్గత కమిటీకి జడ్జీ తొలగింపును సిఫారసు చేసే అధికారం లేదని, కమిటీ పరిధి సిజెఐకి సలహా ఇవ్వడం వరకే పరిమితమని జస్టిస్ వర్మ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, న్యాయమూర్తుల విచారణ చట్టాన్ని సిబల్ ఉదహరించారు. నిర్దేశించిన నియమాలను ఉల్లంఘించడం వలన రాజ్యాంగేతర యంత్రాంగాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. చీఫ్ జస్టిస్ కార్యాలయం కేవలం పోస్టాఫీసు కాదని, సిజెఐకి కొన్ని విధులు ఉన్నాయని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. జడ్జి దుష్ప్రవర్తనకు సంబంధించిన అంశాలు సిజెఐ ఎదుట విచారణకు వస్తే, వాటిని రాష్ట్రపతి, ప్రధానికి పంపాల్సిన బాధ్యత వుందని స్పష్టం చేశారు.
ముగ్గురు జడ్జీల నివేదికను వ్యతిరేకిస్తూ జస్టిస్ వర్మ కేసు ఇకపై కేవలం పార్లమెంటరీ ప్రక్రియ కాదని, రాజకీయంగా మారిందని సిబల్ వాదించారు. అయితే కమిటీ నివేదిక ప్రాథమికమైనదని, భవిష్యత్తు కార్యకలాపాలను ప్రభావితం చేయదని ధర్మాసనం పేర్కొంది. అది ఎవరి నగదో గుర్తించడం కమిటీ విధి కాదని ధర్మాసనం బదులిచ్చింది. ఈ కేసులో తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.