Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంఅస్తమించిన ఉద్యమ శిఖరం

అస్తమించిన ఉద్యమ శిఖరం

- Advertisement -

– 23న అలప్పుజలో అంత్యక్రియలు
– ప్రజల సందర్శనార్థం తిరువనంతపురంలో భౌతికకాయం
– 102 ఏండ్ల వయోభార సమస్యలు

కేరళ ముఖ్యమంత్రిగా, సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులుగా బాధ్యతలు
– కమ్యూనిస్టు యోధుడు వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

మహోన్నత ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత, ప్రజాభిమాన నేత, కమ్యూనిస్టు మేరునగధీరుడు, విప్లవజ్యోతి కామ్రేడ్‌ వీఎస్‌ అచ్యుతానందన్‌కు అరుణారుణ జోహార్లు
తిరువనంతపురం :
కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి, కేరళ రాష్ట్రాన్ని ఆధునిక రాష్ట్ర స్థాయికి అభివృద్ధిపరిచిన అనేక మహత్తర పోరాటాలకు మారుపేరుగా నిలిచిన కామ్రేడ్‌ వీఎస్‌ అచ్యుతానందన్‌ సోమవారం మధ్యాహ్నం 3.20గంటలకు తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు. 102 ఏండ్ల వయసులో తీవ్రంగా గుండెపోటు రావడంతో ఆయనను జూన్‌ 23న తిరువనంతపురంలోని ఎస్‌యుటి ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆయనకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తిరువనంతపురం న్యాయ కళాశాల సమీపంలోని తన నివాసంలో (వెళిక్కకథ) పడిపోయిన తర్వాత గత రెండేండ్లకు పైగా ఆయన పక్షవాతంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఏకేజీ అధ్యయన, పరిశోధనా కేంద్రంలో ఉంచారు. వివిధ వర్గాలకు చెందిన వేలాదిమంది ప్రజలు తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పిస్తున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు దర్బార్‌ హాల్‌కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువెళతారు. మధ్యాహ్నం అలప్పుజ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యాలయానికి తీసుకువెళతారు. అలప్పుజలోని వాలియా చుడుకాడ్‌ వద్ద ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌వీ గోవిందన్‌ ఈ మరణ వార్తను ప్రకటించారు. ఆయన తుది శ్వాస విడిచేందుకు ముందుగానే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా సీనియన్‌ నేతలు పలువురు ఆస్పత్రికి వెళ్ళి వీఎస్‌ను చూసి వచ్చారు. ఆ సమయంలో అచ్యుతానందన్‌ భార్య కె.వసుమతి, పిల్లలు వి.ఎ.అరుణ్‌ కుమార్‌, డాక్టర్‌ వి.ఆశాలు కూడా అక్కడే వున్నారు.

నూట రెండేండ్ల నిండు జీవితం గడిపిన వీఎస్‌ ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవాన్ని గడించారు. కేరళలో కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధిలో ఆటుపోట్లన్నింటినీ దగ్గరగా చూసిన యోధుడాయన. పక్షవాతం, వయో భారంతో వచ్చిన ఇతర అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తుండడంతో క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వీఎస్‌గా అందరికీ సుపరిచితుడైన వెళిక్కకథ శంకరన్‌ అచ్యుతానందన్‌ కేరళ అసెంబ్లీకి ఏడు పర్యాయాలు ఎన్నికయ్యారు.

ప్రస్తుతం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఆయన ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా (2006-2011), మూడు పర్యాయాలు ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1980-91 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.

అవినీతికి, ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా రాజీపడని రీతిలో నిలిచారు. 1956లో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 1957లో అలప్పుజ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1958లో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడయ్యారు. కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా 1964లో ఉమ్మడి పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని బారుకాట్‌ చేసిన 32 మంది కౌన్సిల్‌ సభ్యుల్లో. కేరళకు చెందిన ఏడుగురిలో వీఎస్‌ ఒకరు. ఆయన మరణంతో ఇప్పుడు ఆ తరం అంతా నిష్క్రమించినట్టైంది. 1964లో కోల్‌కతాలో జరిగిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీకి మొదటిసారి ఎన్నికయ్యారు. 1985లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. 2016లో అధికారంలోకి వచ్చిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో పాలనాపరమైన సంస్కరణల కమిషన్‌ చైర్మెన్‌గా నియమితులయ్యారు.

వీఎస్‌ గొప్ప నిర్మాణదక్షుడు. వివిధ పోరాటాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. 1920 అక్టోబరు 20న అలప్పుజా జిల్లాలోని పున్నప్ర వెంటలాతర కుటుంబంలో పున్నప్ర వెళిక్కకథ అయ్యన్‌ శంకరన్‌, అక్కమ్మ అలియాస్‌ కార్తియాని దంపతులకు రెండవ కుమారుడుగా వీఎస్‌ జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా పున్నప్ర పరవూర్‌ ప్రభుత్వ పాఠశాలలోనూ, కలార్‌కోడ్‌ పాఠశాలలోనూ సాగింది. ఆయనకు నాలుగేండ్ల వయసులోనే తల్లి మసూచితో చనిపోయారు. ఏడవ తరగతిలో వుండగా తండ్రి చనిపోయారు. దాంతో ఆయన చదువుకు స్వస్తి పలికి, తన అన్న నడుపుతున్న టైలర్‌ షాపులోనే సహాయకునిగా చేరాడు. ఆ తరువాత అస్పిన్వాల్‌ కంపెనీలో కోయిర్‌ (కొబ్బరి పీచు) వర్కర్‌గా చేరారు. మూడేండ్ల పాటు ఆ కంపెనీలో కొబ్బరిపీచు కార్మికులందరినీ సంఘటితపరిచారు. 17 ఏండ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

కేరళలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడు పి.కృష్ణ పిళ్ళైను కలుసుకున్న తరువాత వీఎస్‌ జీవితం పెద్ద మలుపు తిరిగింది. వీఎస్‌లోని సమర్ధతను, నిర్వహణా నైపుణ్యాలను గమనించిన కృష్ణపిళ్ళై కుట్టనాడ్‌లో భూస్వాముల చేతిలో భయంకర దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికుల మధ్య ఉంటూ వారిని సంఘటితం చేస్తూ, పార్టీని అభివృద్ధిపరిచే పని అప్పగించారు. 1943లో కోజికోడ్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ మహాసభలో అలప్పుజ నుంచి ప్రతినిధిగా పాల్గొన్నారు. ట్రావెన్కోర్‌ దివాన్‌ సీపీ రామస్వామి అయ్యర్‌కు వ్యతిరేకంగా పున్నప్ర-వాయలార్‌ తిరుగుబాటు సమయంలో పార్టీ ఆదేశాల మేరకు అజ్ఞాతంలోకి వెళ్లారు. కొట్టాయంలోని పూంజార్‌లో వుండగా ఆయనను అరెస్టుచేశారు. పోలీస్‌ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారు. వీఎస్‌ చనిపోయాడనుకుని, ఆయన్ని అడవిలోకి తీసుకెళ్లి వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన బతికే వున్నట్లు తేలడంతో కొట్టాయం ఆస్పత్రిలో చేర్చారు. ఆ ఘటన తరువాత రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన అన్ని పోరాటాల్లోను ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

1923
1923 అక్టోబర్‌ 20న అలప్పుజా జిల్లాలో అయ్యన్‌ శంకరన్‌, అక్కమ్మ అలియాస్‌ కార్తియాయని దంపతులకు రెండవ కుమారుడిగా వీఎస్‌ జన్మించారు. పున్నప్ర పరవూరు ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. వీఎస్‌ బాల్యమంతా పేదరికంతో నిండిపోయింది. ఆయనకు నాలుగేండ్ల వయసులో తల్లి అక్కమ్మ మశూచితో మరణించారు. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి కూడా మరణించారు. చదువు మధ్యలో ఆపేసి తన సోదరుని వస్త్ర దుకాణంలో సహాయకుడిగా చేరారు. తర్వాత ఆయన అలప్పుజలోని ఆస్పిన్‌వాల్‌ కాయిర్‌ కంపెనీలో కార్మికుడిగా చేరారు. ఆ కంపెనీలో మూడేండ్లు పనిచేశారు.
1943
1943 కోజికోడ్‌లో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశంలో అలప్పుజ నుంచి పార్టీ ప్రతినిధిగా వీఎస్‌ పాల్గొన్నారు. పున్నప్రా-వాయలార్‌ పోరాటంలో పార్టీ సూచనలను అనుసరించి అజ్ఞాతంలోకి వెళ్లారు. కొట్టాయంలోని పూంజర్‌లో దాక్కున్నప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని దారుణంగా కొట్టి, చనిపోయాడని భావించి అడవిలోకి విసిరేయడానికి తీసుకెళ్లారు. కానీ ఆయన బతికే ఉన్నారని తెలియడంతో కొట్టాయంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక వీఎస్‌ ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో నిలిచారు. అవినీతి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీపడకుండా పోరాడారు.
1956
1956లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1957లో అలప్పుజ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1958లో జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో అవిభక్త పార్టీ నుండి ఉద్భవించిన 32 మంది జాతీయ కౌన్సిల్‌ సభ్యుల్లో కేరళ నుంచి వచ్చిన ఏడుగురిలో వీఎస్‌ ఒకరు. 1964 కోల్‌కతాలో జరిగిన పార్టీ మహాసభలో ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు.
2016
2016- 2021: చైర్మెన్‌, రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్‌
2016లో అధికారంలోకి వచ్చిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంలో పరిపాలనా సంస్కరణల కమిషన్‌ చైర్మెన్‌గా నియమితులయ్యారు.
1959
1959-: కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ మండలి సభ్యుడు.
1964
జాతీయ కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీపీఐ(ఎం) ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు.
2011
2011- 2016: ప్రతిపక్ష నాయకుడు.
2006
2006-2011: ముఖ్యమంత్రి
1962
ఇండియా-చైనా యుద్ధం సమయంలో, వీఎస్‌ను చైనా గూఢచారిగా ముద్రవేసి దాదాపు ఏడాది పాటు జైలులో పెట్టారు.
1980
1980-1991: మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి.
1985
1985లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు.
2001 నుండి 2016 వరకు మలంపూజ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు.
1998
1998- 2001: ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -