Friday, May 2, 2025
Homeజాతీయంపథకం ప్రకారమే జరిగింది

పథకం ప్రకారమే జరిగింది

– ముసుగులు ధరించి ముస్లింల ఆస్తులపై దాడులు చేశారు
– ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు
– అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది
– ముర్షీదాబాద్‌ హింసపై నిజనిర్థారణ బృందం నివేదిక
కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘర్షణలు కేవలం మతపరమైనవి, శాంతి భద్రతలకు సంబంధించినవి మాత్రమే కావని, అది పథకం ప్రకారం జరిగిన హింసాకాండ అని నిజనిర్థారణ బృందం తేల్చింది. రాజకీయ పరిస్థితులు, మత ఏకీకరణ, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం, పోలీసుల అణచివేత వంటివి రాష్ట్రంలో శాంతియుత సహజీవనాన్ని దెబ్బతీశాయని అభిప్రాయపడింది. గత నెల 17, 18 తేదీలలో 17 మంది సభ్యులతో కూడిన నిజ నిర్థారణ బృందం ముర్షీదాబాద్‌లోని పలు ప్రాంతాలలో పర్యటించింది. ఈ బృందం తన పరిశీలనకు సంబంధించిన ముఖ్యాంశాలను నివేదిక రూపంలో పత్రికలకు విడుదల చేసింది. పూర్తి నివేదిక విడుదల కావాల్సి ఉంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, సమీప ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, పోలీసులు, ప్రజా ప్రతినిధుల నుంచి బృందం వివరాలు సేకరించింది.
రాళ్లు రువ్వింది వారే
‘వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 11న జరిగిన నిరసన ర్యాలీలలో ఒక దానిపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు హిందువులు సహా పలువురికి చెందిన దుకాణాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పు పెట్టారు.హిందువులు నడుపుతున్న ఓ మిఠాయి దుకాణం కూడా కాలిపోయింది.సమీపంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ ఎవరూ రాలేదు. ఓ హిందూత్వ సంస్థకు చెందిన వ్యక్తి ఇంటి నుంచి నిరసన ర్యాలీపై రాళ్ల దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆయన ఇటీవలే బెదిరింపులతో కూడిన ఓ వీడియోను ప్రసారం చేశారు. అతని అనుచరులైన ఇద్దరు వ్యక్తుల ఇండ్ల నుంచి కూడా రాళ్ల దాడి జరిగింది. విధ్వంసం గురించి బాధితులు పోలీసులకు చెప్పినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు ఓ హిందూ హోటల్‌పై దాడి చేశారు. వారు మరో మిఠాయి దుకాణంపై కూడా దాడికి ప్రయత్నించగా ముస్లిం దుకాణదారులు అడ్డుకున్నారు’ అని నిజనిర్థారణ బృందం తన నివేదికలో తెలిపింది.
పోలీసు దుస్తులు ధరించి…
హింసను నియంత్రించడంలో జరిగిన పాలనా వైఫల్యం కారణంగా పుకార్లు వ్యాపించి ఆ ప్రాంతంలోని శాంతియుత సహజీవనం విచ్ఛిన్నం కావడానికి దారితీసిందని బృందం విమర్శించింది. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మాదిరిగా దుస్తులు ధరించి ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు ముస్లింల నివాసాలపై దాడులు చేశారని, పలువురు యువకులను అపహరించుకొని వెళ్లారని తెలిపింది. ఈ విధంగా మొత్తం 274 మందిని నిర్బంధించారని, వారిలో చాలా మందిని చిత్రహింసలకు గురిచేశారని వివరించింది. ఆ తర్వాత రోజులలో కూడా హింసాకాండ కొనసాగినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. దుండగులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడినప్పటికీ వారిపై పోలీసులు ముస్లిం ఉగ్రవాదులుగా ముద్ర వేసి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని చెప్పింది. అసలు వక్ఫ్‌ నిరసనలకు, దాడులకు ఏ మాత్రం సంబంధం లేదని బృందం తేల్చింది.
బృందం డిమాండ్లు
‘బీఎస్‌ఎఫ్‌ జవాన్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు ముస్లిం ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. ప్రభుత్వ సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించేందుకు మేము ప్రయత్నించినా బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అనుమతించలేదు. బాధితులు, సాధారణ ప్రజలు…హిందువులైనా, ముస్లింలు అయినా ఆవాసాలను, జీవనోపాధిని కోల్పోయారు. అధికార యంత్రంగం పట్ల వారిలో విశ్వాసం పోయింది. చట్టవిరుద్ధంగా నిర్బంధించిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి. అక్రమ అరెస్టులు చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. అన్ని ఘటనలపై వెంటనే స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి. బాధిత ప్రాంతాలలో శాంతి స్థాపనకు తక్షణ చర్యలు చేపట్టాలి. క్రూరంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. మతపరమైన ఉద్రిక్తతలను నివారించడంలో వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. హింస జరిగిన రోజు విధులలో ఉన్న అధికారులందరిపై చర్య తీసుకోవాలి’ అని నిజనిర్థారణ బృందం డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img