నవతెలంగాణ హైదరాబాద్: ప్రతిష్టాత్మక “కోహినూర్ థియేటర్ కార్నివల్ తెలంగాణ“ ఫెస్టివల్ లోగో ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోహినూర్ థియేటర్ కార్నివల్ తెలంగాణ ను కళాకారులు, నటీనటులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత డాక్టర్ అందెశ్రీ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకుడు అజయ్ మంకెనపల్లి, క్రియేటివ్ థియేటర్ టీం పాల్గొన్నారు.

అనంతరం క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకుడు, కోహినూర్ థియేటర్ కార్నివల్ తెలంగాణ నిర్వహకులు అజయ్ మంకెనపల్లి మాట్లాడుతూ… 2025 సెప్టెంబర్ 15, 16 , 17 తేదీలలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రవీంద్రభారతి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మరి కొన్ని వేదికలో నాటక ప్రదర్శనలు జరగబోతున్నాయని తెలిపారు. ఈ మూడు రోజుల నాటక మహోత్సవంలో జాతీయ, రాష్ట్ర స్థాయి తెలంగాణ రంగస్థల సాంస్కృతిక సంపదను ఒకే వేదికపైకి రానున్నాయని అన్నారు.

అంతేకాకుండా తెలంగాణ జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించామని చెప్పారు. అనేక వైవిధ్యభరితమైన నాటక ప్రదర్శనలు, వివిధ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, స్టాల్స్ మరెన్నో జరగనున్నాయి. ప్రేక్షకులు, విద్యార్థులు, వృత్తి నిపుణులు అందరికీ ఒక అద్భుత అనుభవాన్ని అందించనున్నాయని తెలిపారు. ఈ థియేటర్ ఫెస్టివల్ లో అద్భుతమైన నాటక ప్రదర్శనలు, వర్క్ షాప్స్ లో, ఇంట్రాక్టివ్ సెషన్స్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.