Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకల్లుగీత కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

కల్లుగీత కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

- Advertisement -

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ
నవతెలంగాణ-కామారెడ్డి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్‌లో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కామారెడ్డిలోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కార్యాలయంలో ఎస్‌.వెంకట్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం మూడవ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. పెన్షన్‌ రూ.4వేలకు, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచుతామని, సొసైటీకి 5ఎకరాల భూమి ఇస్తామని, లిక్కర్‌షాప్‌ టెండర్లలో 25 శాతం గౌడ్స్‌కు రిజర్వేషన్స్‌ అమలు చేస్తామని, జనగామ జిల్లాకు పాపన్నపేరు పెడతామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ అమలు చేస్తామని హామీనిచ్చినా.. ఆచరణలో అమలు చేయలేదని అన్నారు. అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పెడచెవిన పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 28న సూర్యాపేటలో గీతన్నల రణభేరి నిర్వహిస్తున్నామని.. దీనికి జిల్లా నుంచి వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 29, 30 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని, అక్రమ మద్యం బెల్టు షాపులను ఆరికట్టాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న గౌడ సొసైటీలకు రూ.50లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, గౌడ కల్లుగీత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు. గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షులు ఎస్‌.వెంకట్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న కల్లుగీత కార్మికులందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, అరులైన వారందరికీ టీఎఫ్‌టీ లైసెన్స్‌ మంజూరు చేయాలని, కల్తీ కల్లు పేరుతో కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి గీత కార్మికుల ఉపాధిని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ సురుగు రాజేష్‌గౌడ్‌, జిల్లా నాయకులు, యాదగిరిగౌడ్‌, శంకర్‌గౌడ్‌, రాజుగౌడ్‌, మోహన్‌గౌడ్‌, సంపత్‌ గౌడ్‌, మోహన్‌గౌడ్‌, స్వామిగౌడ్‌, కనకయ్యగౌడ్‌, మల్లగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -