Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంరికార్డులు సరే.. మారిందేంటి?

రికార్డులు సరే.. మారిందేంటి?

- Advertisement -

అన్నింటా వైఫల్యాలే…
జవహర్‌ లాల్‌ నెహ్రూ తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రెండో ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు పుటల్లోకి ఎక్కారు. నిన్నటి వరకూ ఈ రికార్డు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉంది. ఇందిర 1966 జనవరి 24వ తేదీ నుంచి 1977 మార్చి 24వ తేదీ వరకూ 4,077 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా దేశ ప్రధానిగా కొనసాగారు. శుక్రవారంతో మోడీ అధికారంలోకి వచ్చి 4,078 రోజులు పూర్తయ్యాయి. నాడు ఇందిర, నేడు మోడీ… అనేక విషయాలలో వీరిద్దరి వ్యవహార శైలి ఒకేలా ఉండడం గమనార్హం. ప్రతిపక్ష నేతలు-విమర్శకుల అణచివేత, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు… వెరసి ఇద్దరూ నియంతృత్వ పోకడలకు ప్రతీకలుగా నిలిచారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. నాడు ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ప్రజల ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కాలరాస్తే నేడు మోడీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే ఆ పని చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఇందిర, మోడీ… వీరిద్దరూ పూర్తి భిన్నమైన పరిస్థితులలో పాలనా బాధ్యతలు స్వీకరించారు. ఇందిర 1966 ఎన్నికలలో గెలవలేదు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణంతో ఆమెను ప్రధాని పదవి వరించింది. అప్పుడు ఇందిరకు రాజకీయాలు పూర్తిగా కొత్త. పార్లమెంటులో భయపడుతూ కన్పించే వారు. పెద్దగా మాట్లాడే వారు కూడా కాదు. సోషలిస్ట్‌ నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా ఆమెను ‘మాట్లాడని బొమ్మ’ అని పిలిచే వారు. ఆమె అధికారం చేపట్టే నాటికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పి ఉంది. వృద్ధి రేటు ప్రతికూలంగా.. అంటే -2.6 శాతం ఉంది. యుద్ధం, కరువు, ఆహార కొరత, 19 నెలల కాలంలో ఇరువురు ప్రధానుల మరణం వంటి అననుకూల పరిస్థితుల కారణంగా దేశం బలహీనపడింది. అలాంటి రాజకీయ పరిస్థితులలో ప్రధాని పదవిని చేపట్టిన ఇందిర క్రమంగా అత్యంత శక్తివంతురాలైన నేతగా ఎదిగారు.

2014లో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ నాడు జరిగిన ఎన్నికలలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధిం చింది. ఇంది రతో పోలిస్తే ఆయన పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదు. ఆర్థిక వృద్ధి రేటు కూడా 6.5 శాతంగా నమోదైంది. ఇందిర హయాంలో కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటులో అత్యధిక స్థానాలు ఉండేవి. ఆ మెజారిటీతో ఆమెలో నియంతృత్వ పోకడలు అంకురించాయి. న్యాయస్థానం తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిర, దేశంలో 1975 జూన్‌ 25న అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రతిపక్ష నేతలం దరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. రాజ్యాంగం అనేదే లేకుండా చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరిం చారు. చివరికి ప్రజా గ్రహానికి గురై అధికారాన్ని కోల్పో యారు. 21 నెలల ఎమర్జెన్సీ పాలన అనంతరం అధికారాన్ని కోల్పోయిన ఇందిర, 1977 ఎన్నికలలో తిరిగి అధికారాన్ని చేపట్టి ఏడు సంవత్సరాలు ప్రధాని పదవిని నిర్వహించారు.

1974లో (పోఖ్రాన్‌-1) ఇందిర దేశానికి అణ్వస్త్ర హోదాను ప్రకటించారు. కానీ మోడీ హయాంలో 2019లో పుల్వామాలోనూ, 2025లో పహల్గాంలోనూ ఉగ్ర దాడులు జరిగాయి. దేశంలో ఉగ్ర దాడులు జరిగిన ప్రతిసారీ పాకిస్తానే బాధ్యురాలంటూ నిందించడం మినహా ఇలాంటి ఘటనలను నివారించే ప్రయత్నమేదీ జరగడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో కూడా మోడీ వైఫల్యం కన్పిస్తోంది. ఇక ఆర్థిక విషయాలలోకి వస్తే ఇద్దరి మధ్య అనేక సారూప్యతలు కన్పిస్తాయి. ఇందిరకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఆ తర్వాతి కాలంలో ఆమెనే అనుసరించారు. మోడీ మణిపూర్‌లో జాతుల ఘర్షణలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారు. విదేశాంగ విధానంలో ఇందిర వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భద్రతకు సంబంధించి నాటి సోవియట్‌ యూనియన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మోడీ విదేశాలతో సరైన దౌత్య సంబంధాలు నెలకొల్పుకోలేక పోతున్నారు. చైనా, పాకిస్తాన్‌తో నెలకొన్న సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణహోమాన్ని ఖండించే పరిస్థితి లేదు. విదేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. తాజాగా బ్రిటన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఇలాంటిదే. ఇక అమెరికా విషయంలో సరేసరి. ట్రంప్‌ పెడుతున్న షరతులన్నింటికీ తలవంచడం మినహా చేస్తున్నదేమీ లేదు.

అప్రజాస్వామిక చర్యలు
రెండుసార్లు పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించి తిరుగులేని అధికారాన్ని చెలాయించిన నరేంద్ర మోడీకి గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ప్రజలు షాక్‌ ఇచ్చారు. బీజేపీని మెజారిటీకి ఆమడ దూరంలో నిలబెట్టారు. తెలుగుదేశం, జేడీయూ వంటి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితిని కల్పించారు. అయినప్పటికీ మోడీ ఏ మాత్రం చలించడం లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, విమర్శకుల నోరు మూయించడం వంటి అప్రజాస్వామిక చర్యలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేశారు. మీడియాపై నియంత్రణ, పర్యవేక్షణ పెరిగాయి. సామాజిక మాధ్య మాలపై కన్నెర్ర చేస్తున్నారు. మైనారిటీలు…ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు, నిర్బంధాలు, వేధింపులు పెరిగిపోయాయి.

నేరాలు పెరిగాయి
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాష్టీకాలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోయాయి. నేరాల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా పెరిగింది. బుల్‌డోజర్‌ విష సంస్కృతి తెర పైకి వచ్చింది. మైనారిటీల ఆవాసాలను కూల్చివేయడం, అడ్డువస్తే అరెస్ట్‌ చేయడం నిత్యకృత్యమయ్యాయి. నాడు ఇందిర కానీ, నేడు మోడీ కానీ రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చేశారు. రాష్ట్రపతులు, గవర్నర్లను రబ్బరు స్టాంపులుగా మార్చేశారు. ఇందిర హయాంలో వీవీ గిరి వంటి రాష్ట్రపతులు ఆమె చెప్పిన ప్రతి దానికీ తల ఊపేవారు. ఇప్పుడు మోడీ పాలనలోనూ అంతే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -