Sunday, June 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరైతే రాజు..

రైతే రాజు..

- Advertisement -

ఊర్లో రచ్చబండ వద్ద రైతులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
”చూశారా, మన ముఖ్యమంత్రిని రాజుని చేస్తున్నాడు.
మన తెలంగాణ ఆర్థిక వ్యవస్తను ట్రిలియన్‌ రూ|| ఆర్థిక వ్యవస్థగా మార్చుతున్నాడు.
అదీ కాంగ్రెస్‌ అంటే! రేవంతన్న అంటే ఏమిటనుకున్నారు?” అన్నాడు గర్వంగా రాములు.
”చాల్చాల్లే! ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఆశపడ్డట్టు రైతు భరోసానే ఇయ్యకపోతిరి! ఇగ ట్రిలియన్‌ రూపాయల ఆర్థిక వ్యవస్థను చేసుడంటే కలల్లోని మాటే!” అన్నాడు చంద్రన్న.
”మా అన్నమాట ఇచ్చిండంటే తప్పక చేస్తాడు. మాట తప్పటం మా పార్టీ చరిత్రలోనే లేదు తెలుసా?” రైతును కచ్చితంగా రాజును చేసి తీరుతాడు!” అన్నాడు రాములు.
”మీ ఆరు హామీలు ఇచ్చి, అందులో ఒక్కటే, అదీ మహిళలకు ఉచిత బస్సును అమలు చేస్తున్నాడు. మిగిలినది ఎందుకు అమలు చేయటం లేదు? అయినా మా కేసీఆర్‌ సారు రైతును ఎప్పుడో రాజును చేశాడు. మీకా ఛాన్సు లేదులే!” అన్నాడు చంద్రన్న.
”మీ సారు రైతును రాజుగా చేస్తే ఎందుకు ఓడిపోయాడో చెప్పు చంద్రన్నా!” అన్నాడు రాములు.
”మా సారు రైతుల కోసం రైతుబంధు ఇచ్చాడు. కాళేశ్వరం కట్టాడు. మిషన్‌కాకతీయ పెట్టాడు. ఇన్ని స్కీములు రైతు కోసమే కేసీఆర్‌ సారు పెట్టాడు. వీటి వల్ల రైతు ఎప్పుడో రాజు అయిపోయాడు. అందుకే రైతును రాజుగా చేసే ఛాన్సు మీకు లేదు!” అన్నాడు చంద్రన్న.
”మీ సారు రైతుబంధు ఇస్తే, మా అన్న రైతు భరోసా ఇస్తున్నాడు. దాని కోసం నిన్ననే బటన్‌ కూడా నొక్కాడు. రైతురుణాలు రద్దు చేశాడు. రైతును మీసారు దివాలా తీయిస్తే, మా అన్న రాజును చేస్తున్నాడు!” అన్నాడు చంద్రన్న.
అప్పటిదాకా వీరి మాటలు ఓపికగా వింటున్న మల్లన్నకు ఓపిక నశించింది!
”నోరు ముయ్యిండిరా! పిల్ల సన్నాసుల్లారా?” అన్నాడు కోపంగా మల్లన్న.
పెద్దాయన కోపం చూసి అంతా ఆశ్చర్యపోయారు! ఒకింత భయపడ్డారు! ఎందుకంటే మల్లన్నకు సాధారణంగా కోపం రాదు! అందరితో నవ్వుతూనే మాట్లాడతాడు.
”ఏందిరా! మీ పంచాయితీ! రైతును మీరు రాజుగా చేస్తారా? ఒకడేమో నేను ఇప్పటికే రాజును చేశానని అంటాడు! మరొకడేమో రాబోయే కాలంలో రాజును చేస్తానంటాడు! ఓరే నాకు తెలియక అడుగుతాను! ఒక రైతును ఎన్నిసార్లు రాజును చేస్తారు!” అడిగాడు మల్లన్న.
రాములు చంద్రయ్యలు ఒకరి మొఖాలు మరొకరు చూసుకొన్నారు!
”మీ రెండు పార్టీలతోపాటు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సహా రైతు కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పండి! రైతుబంధు ఇచ్చాం. రైతు భరోసా ఇచ్చాం అని చెప్పకండి! దాని వల్ల రైతుకొంతే లాభపడ్డాడు! అధికంగా లాభపడింది భూస్వాములే!” అన్నాడు మల్లన్న.
”ఇదేం బాగా లేదు! మల్లన్నా. రైతు కోసం చేసిన పనులు కూడా పనికి రావంటే ఎలా?” అన్నారు ఇద్దరూ ఒకేసారి.
”మీరు చేసిన చిల్లర మల్లర పనులు రైతును రాజుగా చెయ్యవంటున్నాను. మీరు చేసిన పనుల వల్ల రైతు ఎప్పుడూ ఆర్థించే వాడుగానే మిగిలిపోతున్నాడు. రాజు ఆర్థిస్తుంటాడు? ఆర్థించేవాడు రాజు ఎలా అవుతాడు? బిచ్చగాడు అవుతాడు! మీరంతా రైతును బిచ్చగాడుగా ఉంచాలని చూస్తున్నారు! అన్నాడు మల్లన్న.
”మమ్మల్ని రైతుల్ని కూడా అవమానిస్తున్నావు మల్లన్నా” అన్నారిద్దరూ కోపంగా.
”నేను కూడా రైతునే కదా! రైతును రాజును చేయటమంటే ఏమిటో తెలుసా? దున్నేవాడికే భూమిని ఇవ్వటం! తాను పండించే పంటకు రైతే ధర నిర్ణయించుకునే అధికారాన్ని రైతుకు కల్పించటం! ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా చేయగలరా మీలో ఎవరైనా?” అడిగాడు మల్లన్న.
రాములు చంద్రన్నా తలదించుకున్నారు.
”రైతు మొదటి నుండీ రాజే! నేలను చీల్చి, ఆ మట్టిలో నుండి పరమానాన్ని బయటకి తీసి, అందరి కడు పులు నింపుతాడు. రైతులు లేకపోతే ఈ సమాజమే లేదు! అలాంటి రైతును మీమీ ప్రభుత్వాలు బిచ్చగాడిని చేశాయి! రకరకాల పేర్లతో రైతుల భూమలు గుంజుకుని, కార్పొరేట్ల కబంధహస్తాల్లో పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి, తిండి గింజలు ఉత్పత్తి చేస్తే, దళారులు, కార్పొరేట్లే ధర నిర్ణయించి, రైతును నిండా ముంచుతారు! విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇలా అన్నింటిల్లో కార్పొరేట్ల కర్రపెత్తనమే! వారు చెప్పిన రేట్లకే రైతు కొనుక్కునాలి! ఈ విధానాన్ని మార్చకుండా రైతును రాజుగా ఎట్లా చేస్తారు?” నిలదీశాడు చంద్రన్న.
ఇద్దరూ మాట్లాడలేదు.
”పండిన పంటను రెచ్చి మార్కెట్లో పెట్టి రేటు కోసం ఎదురుచూపులు చూస్తుంటే వానదేవుడికి కోపం వచ్చి గింజలను నిండా ముంచితే ఆ నీళ్లలో రైతు కన్నీరు కూడా కలిసిపోతుంది. క్రికెట్‌ గ్రౌండ్‌లో వాన కురియకముందే గ్రౌండంతా నానకుండా టార్పాలిన్‌ కప్పే వ్యవస్థను మార్చకుండా రైతును రాజెట్లా చేస్తారు? అడిగాడు మల్లన్న.
రాములు, చంద్రన్న ఏమీ మాట్లాడలేదు!
”కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను దెబ్బతీయాలని చూసినపుడు ఏమైపోయారు మీరు! మీరంతా ఒకటే రైతును ఇలాగే ఉంచి, మెరమెచ్చు మాటలు చెప్పి అధికారంలోకి రావటం వరకే మీరు చేసేది! ఆ తర్వాత మీరు చేసే పనులన్నీ కార్పొరేట్లను రాజులుగా చేస్తాయి తప్ప రైతులను గాదు! ఇకనైనా రైతులను మోసం చేయటం మానుకోండి!” అన్నాడు మల్లన్న.
– ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -