Friday, May 2, 2025
Homeఎడిట్ పేజిపాలకుల చేతిలోనే పతనమైన 'విద్యాహక్కు'

పాలకుల చేతిలోనే పతనమైన ‘విద్యాహక్కు’

నిర్బంధోచిత ప్రాథమిక విద్యకోసం, పిల్లల హక్కులకు 140 సంవత్సరాలుగా దేశంలో సుదీర్ఘ పోరాటం జరిగింది. 1882లో మహాత్మా జ్యోతిరావు ఫూలే హంటర్‌ కమిషన్‌కు ”అందరికీ విద్య” అందిం చాలని వినతి పత్రం అందించిన నాటి నుండి 1911 లో గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో 6-10 సంవత్సరాల వయస్సు గల ‘బాలురకు విద్యాహక్కు కోసం’ ఒక ప్రైవేట్‌ బిల్లును అందజేయడం వరకు అనేక ప్రయత్నాలు జరిగాయి. 1937లో వార్ధాలో జరిగిన ”జాతీయ విద్యా కాన్ఫరెన్సు”లో మహాత్మా గాంధీ ”నయీ తాలిం”ను అమలు చేయాలని కోరారు. 1993లో ఉన్నికృష్ణన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లోని జీవించే హక్కులో భాగంగా విద్యాహక్కు భాగమని, 14 ఏళ్ల లోపు బాల బాలికలు అందరికీ హక్కు వర్తిస్తుందని, ప్రభుత్వాల ఆర్థిక స్థితిని అనుసరించి ఉన్నత విద్య కూడా ఉచితంగా అందించాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో విద్యాహక్కు చట్టం రూపకల్పనకై దశాబ్దం పాటు అనేక చర్చలు జరిగాయి. చివరకు 6-14 ఏళ్ల బాల బాలికలకు విద్యాహక్కును వర్తింపజేస్తూ రాజ్యాంగానికి 86వ సవరణ 2003లో జరిగింది. దీని తర్వాత విద్యాహక్కు చట్టం రూపకల్పనకు తపస్‌ మజుందార్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు చట్ట రూపకల్పన జరిగింది. 2009లో పార్లమెంట్‌ ఆమోదం పొంది, 2010 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ”విద్యా హక్కు చట్టం” అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అనేక సెక్షన్లు రూపొందించి అమలు చేయాలని చెప్పింది.కానీ పాలకుల చేతిలోనే చట్టం పూర్తి నిర్వీర్యమైంది.
ఆరు నుంచి పద్నాలుగేండ్ల వయసుగల ప్రతి బిడ్డకు దగ్గరలోని పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్యను పొందే హక్కు తప్పనిసరిగా ఉండాలని చట్టం చెబుతున్నది. ఇప్పుడు ప్రభుత్వ(పొరుగు) పాఠశాలలు, గ్రామీణ పాఠశాలలు పిల్లలు లేక నిరుపయోగంగా మారుతున్న పరిస్థితి ఉంది. దేశంలో 2014-15, 2023-24 మధ్య కాలంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. కొఠారి కమిషన్‌ నివేదిక ప్రకారం కేంద్రం ప్రతి ఏడాది బడ్జెట్‌లో పదిశాతం విద్య కోసం కేటాయించాలి.కానీ అందులో సగం కూడా లేదు. రాష్ట్రంలో గత పదేండ్లుగా విద్యాబడ్జెట్‌ ఏడాదికేడాది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా అదే మార్గంలో పయనించి తాజా బడ్జెట్‌లో 7.31 శాతానికి కేటాయిం పులు చేసింది. ఈ చట్టం అనేక అంశాల్ని పొందు పరిచింది. ప్రభుత్వాలతో తల్లి దండ్రుల విధుల గురించి నిర్దేశించింది. అందులో పిల్లలందరికీ తప్పనిసరిగా ప్రవేశం కల్పించడం, హాజరు ప్రాథమిక విద్య పూర్తి చేయడం, పాఠశాలలను అందుబాటులో ఉంచడం చేయాలి. పాఠశాల భవనాలను, తరగతి గదులను, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, మౌలిక సదుపాయాల కల్పన చట్టంలోని నిబంధనల ప్రకారం కల్పిం చడం, బోధనా సిబ్బందితోపాటు బోధనోపకరణాలు అందు బాటులో ఉండేలా చూడాలి. సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా చేయడం, ఉపాధ్యాయులకు శిక్షణ సౌకర్యాలు అందించాలి. ఆరేండ్లవరకు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని చెబుతున్నా మన రాష్ట్రంలో అమలు చేయలేదు. అలాగే రాష్ట్రాల్లో ప్రీపైమరీ లేదా ప్రైమరీ లేదా సెకండరీ విద్య కోసం ప్రామాణికమైన ప్రభుత్వ ఉపా ధ్యాయ విద్యాసంస్థలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థి తుల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య అందే అవకాశం లేదు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలున్నా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యా బోధన శిక్షణ లేని ఉపాధ్యాయులతో సాధ్యం కాదు. పైగా తగిన సంసిద్ధత లేకుండా ప్రణాళిక లేకుండా పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు తల్లిదండ్రులకు ఆకర్షణీయంగా ఉండవు. ఆచరణలో ప్రభుత్వ విఫల ప్రయోగంలో మరొకటి చేరుతుంది తప్ప వేరేకాదు. చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో 25శాతం సీట్లు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌) పిల్లల కోసం రిజర్వ్‌ చేయాలి. వారి విద్యా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఇది సమాన విద్యావకాశాలను ప్రోత్సహిస్తుంది. ఆచరణలో ఆ రిజర్వేషన్‌ అమలు కాలేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదు. సెక్షన్‌ 13 ”క్యాపిటేషన్‌ ఫీజు లేదు” అని చెబు తోంది.బడిలో ప్రవేశానికి ఎంపిక విధానాన్ని నిషేధించింది. అయినప్పటికీ పిల్లల అడ్మిషన్‌ కోసం లక్షల రూపాయలు విరాళంగా డిమాండ్‌ చేసే ప్రైవేట్‌ పాఠశాలలు, ప్రవేశ పరీక్షలు నిర్వహించే పాఠశాలలపై చర్యల్లేవు. చట్టాన్ని అమలు చేయని ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, జరిమానా విధించాలని చట్టంలో ఉన్నప్పటికీ ఆ ఊసే లేదు.
అలాగే పాఠశాలల యాజమాన్య కమిటీల ఏర్పాటు, దాని విధుల గురించి ఉన్నా అవి అన్ని పాఠశాలల్లో పని చేయడం లేదు. రాష్ట్రంలో కొత్తగా అమ్మ ఆదర్శ కమిటీలు ఉనికిలోకి వచ్చినప్పటికీ నిధులు లేక వాటి పనితీరు నామమాత్రంగా మారింది. పాఠశాలల వార్షిక తనిఖీలో ధృవీకరించబడినట్లుగా ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ అర్హతలు ఉన్నాయా, లేవా? పరిశీలించి చర్యలు తీసుకున్నది లేదు. ఇక ఉపాధ్యా యుల విధుల గురించి మాట్లాడుకుంటే, వారు సక్రమమైన పనితీరు కనబరుస్తున్నారా అంటే జవాబుదారితనంతో కూడిన పర్యవేక్షణ లేదు. అందుకే ఫౌండేషన్‌, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రంతో సహా అచీవ్‌మెంట్‌ సర్వేలో తెలుగు రాష్ట్రాలు అట్ట డుగునా ఉన్నాయి. తగినంత మంది ఉపాధ్యా యులను పాఠశాలలో నియమించాలి. చట్టంలో ఆదేశిం చినట్లు ప్రతి ఏడాది లేదా కనీసం రెండేండ్లకు ఒకసారి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు ఉండటం లేదు. పదవీ విరమణ, ఇతర కారణాలతో ఖాళీ అయిన ఉపాధ్యా యుల పోస్టుల భర్తీకి నిర్దిష్ట మైన చర్యల్లేవు. ప్రాథమిక విద్యకు పాఠ్యప్రణాళికను, బోధనా పద్ధతులను, మూల్యా ంకన విధానాన్ని అకడమిక్‌ అథారిటీ అయిన ఎస్సీఈఆర్టీ రూపొందించాలి. ఎస్సీఈఆర్టీలో అధ్యాపక పోస్టుల ఖాళీలతో ఆ విధులను అది నిర్వహించడం లేదు. ఈ అంశాలను అమలు చేయడంలో బాలల హక్కుల సం రక్షణకు జాతీయ, రాష్ట్ర కమి షన్లకు అదనపు విధు లను, అధి కారాలను కల్పించింది. అయితే ఈకాలంలో జాతీయ, రాష్ట్ర కమిషన్లు చట్టాల ఉల్లంఘనపై తన అధికారాలను విని యోగించలేదనేది క్షేత్రస్థాయిలోని వాస్తవం. అంటే విద్యాహక్కు చట్టం కేవలం దిష్టిబొమ్మగానే మిగిలి పోయింది. పైగా తప్పులు చేసిన అధికారులపై ప్రాసిక్యూషన్‌ చేపట్టడానికి పైఅధికారి నుండి అనుమతి పొందాలని ఉన్నప్పటికీ ఇది అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇచ్చే రక్షణ. అందుకే చట్టం అమలు ఉత్తదైంది.
”విద్యాహక్కు చట్టం -2009”పేరు ఉచ్చరించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు.విద్యాహక్కు చట్టం చదువుకునే విద్యార్థులకు” నాన్‌-డిటెన్షన్‌”విధానం అమ లు జరపాలని, సెక్షన్‌ ఆరు ప్రకారం విద్యార్థులు తమ వయస్సు ఆధారిత తరగతిలో ఉండాలని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఆసర్‌ నివేదిక సాకుగా చూపి, గీతాబుక్కల్‌ కమిటీ చేసిన ఓ చిన్న వెసులుబాటును ఆసరాగా 5, 8 తరగతులకు ”డిటెన్షన్‌”విధానం అమలు జరపాలని విద్యాహక్కు చట్టాన్ని సవరించింది. డిటెన్షన్‌ అమలైతే విద్యార్థుల్లో డ్రా పౌట్లు పెరిగి, అందరికీ విద్య ప్రశ్నా ర్థకంగా మారుతోంది. మన పాల కులు అంతర్జాతీయ ఫోరమ్‌ల పై ప్రాథమిక స్థాయి నుండి 12 వ తరగతి వరకు ఉచిత, నాణ్యమైన/ గుణాత్మక విద్య పిల్లలకందిస్తామని ఒప్పుకుంటారు. ఈ నేపథ్యంలో సమాన విద్యావ్యవస్థ అనగా సమాజంలోని సభ్యు లందరికీ సమానంగా, నాణ్యమైన విద్య లేదా సమాన నాణ్యత గల విద్య అని అర్థం. ఈ సమాజంలోని ప్రతి బాలుడికి, బాలికకు స్వేచ్ఛ, సమాన త్వాలతో కూడిన విద్యా అవకాశాలను కచ్చి తంగా అంది వ్వడమే ఈ సమాన విద్యాభావన. ఇది ఒక రకంగా పద్నాలు గేండ్ల వరకు బాలబాలికలకు నిర్బంధంగా విద్య నందివ్వడం అవు తుంది. అనేక పోరాటాల ఫలితంగా రూ పొందించిన విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే క్రమంలో మన ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి.ప్రభుత్వాలు తాము చేసిన చట్టాన్ని తామే ఉల్లంఘిస్తున్న పరిస్థితుల్లో బాల బాలికలకు సమాన విద్య అందించే కృషిలో పౌర సమాజం, మేధావి వర్గం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

– కె.వేణుగోపాల్‌
9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img