- కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై అమర వీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో పుష్పగుచ్చాలతో నివాళలర్పించిన అనంతరం అమరవీరుల కుటుంబాలకు పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పోలీస్ శాఖ దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణకు,ప్రజా రక్షణకు విది నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి సెలవలు లేకుండా ప్రజల రక్షణే ద్వేయంగా పని చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఎందరో అమరులయ్యారని వారి త్యాగాలు మరవలేనివి అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరిగిందనీ, ఇప్పటి వరకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ నాలుగు ఖాళీలను గుర్తించడం జరిగిందని తెలిపారు.పోలీస్ అమరవీరుల స్మృతి ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటామని తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణకు విది నిర్వహణలో ఎంతో మంది అమారులవుతున్నారనీ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విది నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో పోరాడి 191 మంది పోలీసులు అమరులైనారనీ, వారిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఉన్నారని తెలిపారు.ఎందరో పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను లెక్కచేయకుండా విధి నిర్వాహణలో వారి ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని అన్నారు. వారి త్యాగం వలనే నేడు శాంతియుత వాతవరణం నెలకొన్నదని, ప్రజలు కూడా శాంతి యుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలు మరవలేనివి అన్నారు. పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ లో నిత్యం పోరాటం చేస్తున్నారని, మన జిల్లా లో ఇప్పటి వరకు 15 మంది విది నిర్వహణ అమరులైనారని అమరవీరులైన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారు.
ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో నేటి నుండి ఈ నెల 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు పోలీస్ ఓపెన్ హౌస్,మెగా రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, అడిషనల్ ఎస్పి రమేష్, యస్.బి డీఎస్పీ మల్లారెడ్డి నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవ రావు, రాము,మహా లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి,శ్రీను నాయక్,సురేష్,చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, సూరప్ప నాయుడు,నరసింహ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.