జహీరాబాద్ పట్టణంలో పేదలకు
ఇండ్లు ఇచ్చేందుకు అంగీకారం
లబ్దిదారులకు ఇండ్ల తాళాలు ఇవ్వాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశం
13న డబుల్ బెడ్‌రూం ఇండ్లు అప్పజెప్పాలి
నిర్లక్ష్యం చేస్తే పేదలే ఇండ్లను స్వాధీనం చేసుకుంటారు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
వర్షంలోనూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-జహీరాబాద్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటం ఫలించింది. లబ్దిదారులకు ఇండ్ల తాళాలు ఇవ్వాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశమిచ్చారు. ఈ విషయాన్ని జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులకు తహసీల్దార్ తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్దిదారులు ధర్నా చేశారు. వర్షం పడుతున్నా అక్కడి నుంచి కదలకుండా కూర్చున్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేసి సర్టిఫికెట్లు అందజేసిన ప్రభుత్వం ఇంత వరకు ఇండ్లను అప్పజెప్పలేదని, ఈ నెల 13న ఇండ్ల తాళాలు ఇవ్వకపోతే పేదలే స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి(కె)లో గత ప్రభుత్వం 660 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి 660 మంది లబ్దిదారులను ఎంపిక చేసి 2023 సెప్టెంబర్‌లో పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉన్నందున లబ్దిదారులకు ఇండ్లను అప్పగించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి లబ్దిదారుల జాబితాలను ఎంపిక చేసినప్పటికీ అర్హులుగా గుర్తించిన వారికి తాళాలివ్వలేదన్నారు. ఇండ్లను అప్పజెప్పాలని సీపీఐ(ఎం) అనేక సార్లు లబ్దిదారులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేసిందన్నారు. మంత్రులు, కలెక్టర్‌ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇటీవల రెండ్రోజులపాటు ఆందోళన చేసిన ఫలితంగా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని అన్నారు. లబ్దిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో సర్వే చేసి సమగ్రమైన వివరాలు సేకరించినప్పటికీ ఇండ్లను అప్పజెప్పకపోవడం దుర్మార్గమన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో అనర్హులకు ఇవ్వాలనే దురుద్దేశంతోనే నిజమైన పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఈ నెల 13న లబ్దిదారులకు ఇండ్లను అప్పజెప్పి తాళాలివ్వాలని, లేనిపక్షంతో ప్రజల్ని సమీకరించి పెద్ద త్తున పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ.. ఇండ్ల కేటాయింపుల్లో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. అధికార యంత్రాంగం సైతం క్షేత్రస్థాయి వాస్తవ నివేదికల ఆధారంగా లబ్దిదారులకు ఇండ్లకు అప్పజెప్పకుండా రాజకీయ నాయకులు చెప్పినట్లు నడుచుకోవడం సరైంది కాదన్నారు. లబ్దిదారులకు తాళాలివ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినందున వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులతో తహసీల్దార్ చర్చలు జరిపారు. ఈ నెల 13న లబ్దిదారులకు తాళాలు అప్పజెప్పేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు తహసీల్దార్ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జహీరాబాద్ ఏరియా కార్యదర్శి బి.రాంచందర్, ఏరియా కమిటీ సభ్యులు మహిపాల్, నాయకులు ముతబీర్, రాజిరెడ్డి, బక్కన్న, బాల్ రాజ్, నాయకులు నరేష్, వంశీ, కిరణ్, సాయి గౌడ్, బాబు పాల్గొన్నారు.
ఫలించిన సీపీఐ(ఎం) పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES