- మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి
నవతెలంగాణ ఆర్మూర్
సచివాలయం అంతా అవినీతి కంపుగా మారిందని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులకు పనులను బట్టి లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలవని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు. ప్రతీ మంత్రి పేషీలో ఇదే తంతు కొనసాగుతూ సచివాలయమంతా అవినీతి కంపు కొడుతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన అని, ఇది తామన్నది కాదని, ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని గుర్తు చేస్తూ సురేఖ మాటలు కాంగ్రెస్ సర్కార్ అంతులేని అవినీతికి నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి సురేఖ కామెంట్స్ పై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డే పెద్ద అవినీతి భూతమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి శరాఘాతమని ఆయన నిప్పులు చెరిగారు. పీసీసీ అంటేనే ప్రదేశ్ కరెప్షన్ సెంటర్ అని, అది ఇండియన్ నేషనల్ క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి పునాదుల మీద పెరిగిన కాంగ్రెస్ పార్టీ పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట అని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్,శాండ్, మైన్, వైన్ మాఫియా అని ఆయన దుయ్య బట్టారు. నాటి ఆంగ్లేయులది, నేటి కాంగ్రెస్ ది ఒకటే వంకరబుద్ది, కాంగ్రెస్ ఈస్టిండియా కంపెనీ అయితే బీజేపీ నార్తిండియా కంపెనీ అని జీవన్ రెడ్డి పేర్కొంటూ ఈ రెండూ దేశాన్ని దోచుకునే దోపిడీ కంపెనీలేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాన్ని పాడు చేస్తున్న మిడతలదండుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అంటేనే సంపన్నులకు ఆపన్న హస్తం, పేదలకు రిక్త హస్తం. అబద్దాలు, అవినీతి,అక్రమాలకు పుట్టిన అభవిక్త కవల. అందినకాడికి ప్రజాధనాన్ని నొక్కడంలో, మెక్కడంలో అందె వేసిన చెయ్యి. కాంగ్రెస్ అంటేనే అవినీతి చీడ. దేశానికి పట్టిన పీడ. జలయజ్ఞం, 2జీ, భూపందారాలు, ఆగస్టా, కోల్ -ఇలా పంచభూతాలను దిగమింగిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్, అవినీతి రెండూ రాహుకేతువులు లాంటివి. గరీబీ హఠావోను గాలికొదిలేసింది. పైసా కమావో బాట పట్టింది. అవినీతి పాఠాల్లో కాంగ్రెసు కె ఫస్ట్ మార్క్. ఏ ఫర్ ఆదర్శ్. బీ ఫర్ బోఫోర్స్. సీ ఫర్ కామన్ వెల్త్ స్కామ్, డీ ఫర్ దేవాస్ యాంత్రిక్స్-ఇలా ఏ టూ జెడ్ కాంగ్రెస్ కరప్షన్ కహానీలే.
బోఫోర్స్ గన్నులు, టాటా ట్రక్కులు, ఆగస్టా హెలీ కాఫ్టర్లు ఇలా అన్నింట్లో కాంగ్రెస్ ఆవినీతే నిత్య దర్శనం. అవినీతి అమీబా కాంగ్రెస్. కాంగ్రెస్ డీ.ఎన్. ఏ లోనే కరప్షన్ ఉంది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ అవినీతి చట్టబద్దమనే విధంగా ఉన్నాయ న్నారు. కాంగ్రెస్ అవినీతి భాగోతాలపై సభా కమిటీ వేయాలి. లేదా సీబీఐచే విచారణ జరిపించాలి. అవినీతి మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ కు ఏమాత్రం సిగ్గూశరం ఉన్న సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.