Sunday, September 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'స్టాండింగ్‌' కమిటీ…

‘స్టాండింగ్‌’ కమిటీ…

- Advertisement -

దేశంలోని వివిధ రంగాలకు సంబంధించిన అనేకాంశాలను పరిశీలించి, పరిష్కారమార్గాలు కనుక్కునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పలు పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేస్తుంటుంది. లోక్‌సభ లేదా రాజ్యసభలోని సీనియర్‌ ఎంపీని ఆయా కమిటీలకు చైర్మెన్‌గా నియమిస్తుంటారు. వివిధ పక్షాలకు చెందిన ఎంపీలు అందులో సభ్యులుగా ఉంటారు. సదరు చైర్మెన్‌ నేతృత్వంలో స్టాడింగ్‌ కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, కేటాయించిన అంశాలపై అధ్యయనం నిర్వహించి, అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంటుంది. నెహ్రూగారి హయాం నుంచి నేటి వరకూ కొనసాగుతున్న ప్రక్రియ ఇది. అయితే పార్లమెంటు తరహాలోనే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సైతం ఆ ఆఫీసు కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి ఒక ‘స్టాండింగ్‌’ కమిటీని వేశారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అధికార పార్టీ కాంగ్రెస్‌ తాను ఇచ్చిన హామీల అమలును విస్మరించిం దంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయాన్ని ఎండగట్టాలని పిలుపుని స్తూ పార్టీ శ్రేణులతో ఒక మీటింగ్‌ నిర్వహిం చారు. అది అయిపోగానే కేటీఆర్‌ వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి… పాత్రికేయులతో పిచ్చా పాటిగా మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగటం, హైదరాబాద్‌లో వరదలు తదితరాంశాలపై ఆయన జర్నలిస్టులతో ముచ్చటిస్తున్నారు. మధ్యలో ప్రశాంత్‌ రెడ్డి ‘నిలబడ’గా.. ఆయన చుట్టూ ఉన్న విలేకరులు కూడా ‘నిలబడే…’ మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాన్ని ఓ పది నిమిషాలపాటు గమనించిన రావుల… ప్రశాంత్‌రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడేదో ‘స్టాండింగ్‌’ కమిటీ సమావేశం జరుగుతున్న ట్టుంది.. అందులో నన్ను కూడా భాగస్వామిని చేసుకుం టారా? అంటూ చలోక్తి విసరటంతో ప్రశాంత్‌రెడ్డి తోపాటు పాత్రికేయులందరూ ఘొల్లుమన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడిగా, తనకున్న పార్లమెంటరీ అనుభవాన్ని ఉపయోగించి రావుల వేసిన సెటైర్‌కు అక్కడ ఈ రకంగా నవ్వుల పువ్వులు విరిశాయి.
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -