నవతెలంగాణ-హైదరాబాద్: ఎల్గర్ పరిషద్ కేసులో అక్రమంగా అరెస్టయిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ పిటిషన్ విచారణ నుండి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ మంగళవారం తప్పుకున్నారు. సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టాల్సి వుంది.
తన క్లయింట్ సురేంద్ర గాడ్లింగ్ ఆరున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారని, బెయిల్ పిటిషన్‌పై ముందస్తు విచారణ కోరుతున్నట్లు సిజెఐ బి.ఆర్.గవాయ్‌కి ఆగస్ట్8న, సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ 11 సార్లు వాయిదా పడిందని వెల్లడించారు.
మార్చి27న జస్టిస్ సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం న్యాయవాది గాడ్లింగ్, కార్యకర్త జ్యోతి జగ్తాప్ బెయిల్ విచారణను వాయిదా వేసింది. కార్యకర్త మహేష్ రౌతుకు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా వాయిదా వేసింది. కార్యకర్త మహేష్ రౌత్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని ఎన్‌ఐఎ కోరిన తర్వాత బెయిల్‌ను నిలిపివేసింది.
మావోయిస్టులకు సహాయం అందించారని, ఈ కేసులో పరారీలో ఉన్న వారితో పాటు సహ నిందితులతో కుట్ర పన్నారని న్యాయవాది గాడ్లింగ్‌పై ఆరోపణలు నమోదయ్యాయి. యుఎపిఎలోని పలు నిబంధనల కింద ఆయనపై కేసు నమోదైంది. ప్రభుత్వ కార్యకలాపాల గురించిన రహస్య సమాచారాన్ని, కొన్ని మ్యాప్‌లను మావోయిస్టులకు అందించారనిఐపిసి మరియు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సుర్జాగఢ్ గనుల కార్యకలాపాలను వ్యతిరేకించాలని మావోయిస్టులను కోరినట్లు, పలువురు స్థానికులను ఉద్యమంలో చేరమని ప్రేరేపించినట్లు ఆరోపించింది.
2017, డిసెంబర్ 31న పూణెలో జరిగిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన ఎల్గార్ పరిషద్ మావోయిస్టు సంబంధాల కేసులో గాడ్లింగ్ ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ ప్రసంగాలతో మరుసటి రోజు జిల్లాలోని బీమా కోరెగావ్ స్మారక చిహ్నం సమీపంలో హింస నెలకొందని పోలీసులు ఆరోపించారు.