Tuesday, April 29, 2025
Navatelangana
Homeతాజా వార్తలుబీజేపీ విధానాలతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం

బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం

- Advertisement -

– ఉపాధి, హక్కుల కోసం పోరాడేది ఎర్రజెండానే
– భూముల రక్షణ కోసం మరో ఉద్యమం: కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
– దేశం వెలిగిపోతే ‘ఉపాధి’ కూలీ డబ్బులెందుకు ఇవ్వరు? : వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌
– నారాయణపేట జిల్లా మరికల్‌లో బహిరంగ సభ
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మారుమూల ప్రాంతమైన నారాయణపేట జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి 1850 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని అన్నారు. ఉపాధి, హక్కుల కోసం పోరాడేది ఒక్క ఎర్రజెండానే అని చెప్పారు. దేశంలో భూ చట్టాలు, కౌలుదారీ చట్టం కమ్యూనిస్ట్టుల పోరాటాల వల్లే వచ్చాయని గుర్తు చేశారు. అయితే, గతంలో పోరాటాలు చేసి సాధించుకున్న భూములను ఇప్పుడు పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో పాలకులు లాక్కుంటున్నారని, ఆ భూముల రక్షణ కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో మరో ఉద్యమం చేపట్టామ న్నారు. అమెరికా అధ్యక్షులు మన దేశ వస్తువులపై అధిక పన్నులు వేశారని, దీనిపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అమెరికా విధానాలపై అనేక దేశాలు మౌనం పాటించినా.. కమ్యూనిస్టు దేశమైన చైనా.. అమెరికాను సవాల్‌ చేసేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం సద్దుమణి గితే వచ్చేది ఎర్రజెండానేనని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఫార్మాసిటీ కోసం 13500 ఎకరాలు తీసుకుంటే, రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక మరో 30 వేలు కలిపి 45వేల ఎకరాలతో స్మార్ట్‌సిటీ పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి : వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. దేశం వెలిగిపోతుందన్న మోడీ ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు కూడా వేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల దేశంలో 10 కోట్ల మందికి నాణ్యమైన ఆహారం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేషన్‌ షాపుల్లో సన్నబియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 20శాతం మంది దగ్గర 80 శాతం ఆస్తులు ఉన్నాయని, వాటిని 80 శాతం మందికి పంచేందుకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మే1 నుంచి చేపట్టనున్న గ్రామీణ ఉద్యమాల్లో భాగంగా భూములను ప్రభుత్వం పంచేలా పోరాటం చేయాలని అన్నారు. బహిరంగ సభకు ముందు భారీ ప్రదర్శన తీశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు, జిల్లా కార్యదర్శి ఉడ్మలగిద్ద గోపాల్‌, గౌరవాధ్యక్షులు పి.వెంకట్‌రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, భూబాధితుల సంఘం జిల్లా ఉపాద్యక్షులు పి.ఆంజనేయులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, గొర్రెల కాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్‌, సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కారదర్శి వెంకట స్వామి, అమరచింత మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ జీఎస్‌ గోపీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అంజిలయ్య, కార్యదర్శి బాల్‌రాం, బాలప్ప, మహిమూద్‌, మహేష్‌, మల్లన్న, పద్మ, ప్రసాద్‌, పొన్నం పాల్గొన్నారు.
ధరలు దించాలి.. భూములు పంచాలి
– సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
– కేంద్ర ఫాసిస్టు విధానాలను నిలువరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
వందల ఎకరాలు కలిగిన వారి నుంచి భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిత్యావసరాల ధరలు దించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని అన్నారు. డబ్బులున్న వారి మేలు కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలపై ఉద్యమించాలన్నారు. ఫాసిస్టు విధానాలతో ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కులమతాల మధ్య ఘర్షణలు పెట్టి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కల్గించేలా వ్యవహరిస్తున్నారన్నారు.
రాబోయే కాలంలో ఇండ్లు, స్థలాలు, పని హక్కు కోసం ఆందోళనలు చేస్తామన్నారు. గుడిసె లేని దేశంగా తీర్చిదిద్దుతామని మోడీ.. ప్రతి ఒక్కరికీ రెండు పడకల గదులు ఇస్తామన్న కేసీఆర్‌ మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. రేషన్‌ కార్డులతో పాటు కేరళ తరహా 14 నిత్యావసర సరుకులను పౌరసరఫరాల శాఖ ద్వారా అందజేయాలని డిమాండ్‌ చేశారు. విద్య, వైద్యం కోసం ప్రతి కుటుంబానికీ లక్షలు ఖర్చవుతున్నాయని, వీటిని ఉచితంగా అందించాలని కోరారు. ఉపాధి, సమాజిక న్యాయం కోసం, అసమానతలను తగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు