Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంరూ.19,838.58 కోట్ల బ్యాంకు రుణాల మంజూరే లక్ష్యం

రూ.19,838.58 కోట్ల బ్యాంకు రుణాల మంజూరే లక్ష్యం

- Advertisement -

– 2024-24లో తీసుకున్న రుణాల్లో 98.60 శాతం చెల్లించిన మహిళా సంఘాలు
– సెర్ప్‌ వార్షిక ప్రగతి, ప్రణాళిక విడుదల
– 3,55,138 మహిళా స్వయం సహాయక సంఘాలకు లబ్ది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో 3,55,138 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.19,838.58 కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పెట్టుకున్నది. 2024-25కు సంబంధించిన వార్షిక ప్రగతిని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా 2,13,948 సంఘాలకు రూ.20,069.80 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. 2024-25 చివరి నాటికి 3,76,025 సంఘాలపై రూ.26,103.15 వేల కోట్ల బ్యాంకు అప్పు కలిగి ఉన్నవి. మహిళా సంఘాలు తీసుకున్న రుణాల్లో 98.60 శాతం తిరిగి ఇప్పటికే చెల్లించబడ్డాయి. 1050 బ్యాంకు మేనేజర్లకు 2024-25 ఆర్‌బీఐ సర్క్యూలర్‌పైనా, ఎస్‌హెచ్‌జీ ఎంటర్‌ప్రైజ్‌ రుణాల మంజూరుపైనా అవగాహన కల్పించింది. మహిళా సంఘాల్లో ఉన్నత చదువులు చదివిన వారిలో 600 మందిని ఎంపిక చేసి బ్యాంకు సఖిలుగా నియమించింది. 2,22,518 ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఎంటర్‌ ప్రైజ్‌ రుణాలను మంజూరు చేయించింది. రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చిన 553 మందిని ఆర్థిక అక్షరాస్యత కార్యకర్తలుగా తీర్చిదిద్దింది. 19,75,560 స్వయం సహాయక సంఘ మహిళలకు గ్రామ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించింది. డిజిటల్‌ మోసాల్‌కు గురికాకుండా 12,775 గ్రామ సంఘాల పరిధిలోని ప్రజలను చైతన్యపర్చింది. రాష్ట్రంలోని 11 ఆర్‌ఎస్‌ఈటీఐల ద్వారా 10,804 మంది నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధిపై శిక్షణను ఇప్పించింది. ఎవరైనా సభ్యులు చనిపోతే రూ.2 లక్షల లోపు రుణం ఉంటే మాఫీ చేసింది. రాష్ట్రంలో 2024-25కుగానూ 3,32,324 సంఘాలకు రూ.220.62 కోట్ల వడ్డీ రాయితీని ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ రూ. 518.66 కోట్ల వడ్డీ రాయితీని మహిళా సంఘాలకు సెర్ప్‌ చెల్లించింది.
2025-26 లక్ష్యాలు ఇలా…
రాష్ట్రంలో 3,55,138 స్వయం సహాయక సంఘాలకు రూ.19,838.58 వేల కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.1,639.05 కోట్లతో, 52,715 సభ్యులకు వ్యక్తిగత ఎంటర్‌ ప్రైజ్‌ రుణాలివ్వాలని టార్గెట్‌ పెట్టుకున్నది. 1000 బ్యాంకు మేనేజర్లకు ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజిపై శిక్షణ ఇవ్వనున్నది. 2600 మంది ఏపీఎమ్‌, సీసీలకు మహిళా జీవనోపాదుల కల్పనపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయిం చింది. రాష్ట్రంలో 64 మంది అడిషనల్‌ డీఆర్‌డీఓలు, డీపీఎమ్‌లకు జీవనోపాధిపై శిక్షణ ఇప్పించనున్నది. మరో 500 మంది సభ్యులను బ్యాంకు సఖిలుగా తీర్చిదిద్దనున్నది. 1106 మందికి శిక్షణ ఇప్పించి వారితో వ్యక్తిగత ఎంటర్‌ ప్రైజ్‌లను పెట్టించనున్నది.
ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 చేపట్టబోయే కార్యక్రమాలు
రాష్ట్రంలో ఐదేండ్లలో మహిళా సంఘాల్లోని ప్రతి మహిళనూ కోటీశ్వరాలిని చేయాలనే సంకల్పంతో లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మంజూరు చేయించనున్నది. 15-18 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలతో ”బాలికా సంఘాలు” ఏర్పాటు చేసి, ఆరోగ్యం, పోషణ, ప్రస్తుత సామాజిక పరిస్థితులు, డిజిటల్‌ మోసాలు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. రూ. 110 కోట్ల వ్యయంతో, 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం చేపట్టనున్నది. రాష్ట్రంలోని పర్యాటకప్రాంతాల్లో, కలెక్టరేట్లలో, రిజిస్ట్రేషన్‌, మున్సిపాల్టీ కార్యాలయాల్లో, ఆస్పత్రులు, కళాశాలు, పారిశ్రామిక పార్కులు, బస్టాండ్లలో ”మహిళా శక్తి” క్యాంటీన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించనున్నది. రాష్ట్రంలో 2030 వరకల్లా 32 జిల్లాల్లో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఎస్‌హెచ్‌జీలతో ఏర్పాటు చేయించనున్నది. రూ.1.23 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జిల్లా సమాఖ్యల ద్వారా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుని పెట్రోల్‌ బంకులు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -