– వర్షంతో సన్‌రైజర్స్, క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మెరుపు ప్రదర్శనతో గర్జించినా.. వరుణుడు ఉరుములతో గర్జించి ఆరెంజ్ ఆర్మీకి నిరాశే మిగిల్చాడు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కుండపోత వర్షంతో రద్దుగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తర్వాత మొదలైన వర్షం.. నెమ్మదిగా కుండపోతగా మారింది. భారీ వర్షంతో స్టేడియం చెరువును తలపించింది. 11 గంటల తర్వాత వర్షం ఆగినా.. అవుట్‌ఫీల్డ్ పూర్తిగా తడిసిపోయింది. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు 11.20 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో పాయింట్ పంచుకున్నాయి. 11 మ్యాచుల్లో మూడు విజయాలతో సన్‌రైజర్స్ ఏడు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలువగా.. 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో నిలిచింది.
పాట్ కమిన్స్ విజృంభణ
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ను కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుండి నడిపించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్ (0)ను అవుట్ చేసిన కమిన్స్.. సన్‌రైజర్స్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8), అక్షర్ పటేల్ (6) నిష్క్రమణతో పవర్‌ప్లేలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 26/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. కెఎల్ రాహుల్(10), విప్రాజ్ నిగమ్ (18) సైతం చేతులెత్తేయగా.. 62/6తో క్యాపిటల్స్ వంద లోపే ఆలౌటయ్యే ప్రమాదంలో పడింది. ఢిల్లీ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్, 36 బంతుల్లో 4 ఫోర్లు), ఆషుతోశ్ శర్మ (41 నాటౌట్, 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకోవటంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్ (3/19), జైదేవ్ ఉనద్కత్ (1/13), హర్షల్ పటేల్ (1/36), ఈషన్ మలింగ (1/28) రాణించారు.
బౌలర్ల మెరుపులు.. వరుణుడి ఉరుములు
- Advertisement -
- Advertisement -