Sunday, July 13, 2025
E-PAPER
Homeసోపతిపిచ్చోని చేతిలో రాయిలా ట్రంప్ వ్య‌వ‌హారం!

పిచ్చోని చేతిలో రాయిలా ట్రంప్ వ్య‌వ‌హారం!

- Advertisement -

చెట్టు చెడేనాటికి కుక్కమూతి పిందెలు పుట్టినట్లు, సామ్రాజ్యవాద దోపిడీ పరాకాష్ట దశ – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండో రాకడ తర్వాత కనబడుతున్న అతని అసంబద్ద వ్యవహార శైలిలోనూ, వాచాలత్వంలోనూ అనూహ్యంగా వ్యక్తం అవుతున్నది.
ప్రజాపాలనకు మార్కెట్‌ దోపిడీకి మధ్య వుండే సున్నితమైన సంబంధాన్ని అతగాడు చెరిపేస్తున్నాడు. దేశాల మధ్య వుండవలసిన కనీస గౌరవ మర్యాదలు ఏ మాత్రం పాటించక ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. పరిస్థితి పిచ్చోని చేతిలో రాయిలా మారింది.
అమెరికా కుబేరులకు (ట్రిలియనీర్స్‌, బిలియనీర్స్‌) మరింత ఊతం ఇవ్వాలనే సంకల్పంతో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ను తీసుకువచ్చాడు. ఆ దేశ ఉభయ సభలలో స్వల్ప మెజారిటీతో (నాలుగు ఓట్లు) ఆ బిల్లు గట్టెక్కడంతో ట్రంప్‌ చర్యలకు ఇప్పుడు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అమెరికా పుట్టి 250 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమోదం పొందిన ఈ వేయి పుటల బిల్లు ఓ చారిత్రాత్మకమని తనకు తానే జబ్బలు చరుచుకుంటూ పొంగిపోతున్నాడు. ఇక అమెరికాకు తిరుగే వుండదని, తన ఏలుబడిలో అమెరికా రాకెట్‌లా దూసుకుపోతుందని ప్రకటించుకున్నాడు.
తన రెండో రాకడకు కారణభూతమైన ఈ అపర కుబేరులను పన్ను మినహాయింపులతో ఆదుకోబోతున్నట్టు ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. ఎందుకంటే మరి ఆ కుబేరులు ట్రంప్‌ విజయానికి భూరి విరాళాలు అందజేశారు.
ఆర్థిక నిచ్చెన మెట్లల్లో పై అంతస్థుల్లో ఉండే ఈ ఇరవై శాతం కుబేరులకు ఊతం ఇచ్చేందుకు గాను అట్టడుగున వుండే సాధారణ పౌరులపై అమితంగా పన్నుభారాలు వేస్తూ ఘోరంగా శిక్షిస్తున్నాడని అమెరికా వాసులు వాపోతున్నారు.
సామాన్యుల విద్య, వైద్యం, ఆహార సదుపాయాలకు అందవలసిన ప్రభుత్వ సాయాన్ని ట్రిలియన్‌ డాలర్ల స్థాయిలో కోతలు పెడుతున్నాడు.
ఈ అపర కుబేరుల్లో ఎక్కువమంది ఆయుధ ఉత్పత్తి కర్మాగారాల సముదాయాలు (మిలటరీ ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌) కలిగినవారు. ఒక పక్క ఇలాంటి యజమానులకు బాహాటంగానే కొమ్ము కాస్తూ, మరోపక్క నోబెల్‌ శాంతి బహుమతి కోసం అంగలార్చడం ఏం రాజనీతి? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు కూడా.
ఇది ఇలా వుండగా ఇంకో పక్క ఈ బిల్లుద్వారా అంతర్గత ప్రజా ఉద్యమాలను నిర్దాక్షణ్యంగా అణచివేసేందుకు ట్రంప్‌ సిద్ధమవుతున్నాడు. అందుకోసం మూడు వందల బిలియన్‌ డాలర్లను సమకూర్చుకున్నాడు. అమెరికాలో బతుకుతెరువుకై వచ్చిన వలస జీవుల (ఏలియన్స్‌) ఏరివేతకు అవసరమైన అన్ని వ్యవస్థలను ఆధునీకరిస్తానని, అందుకోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్టు తెలిపాడు.
ట్రంప్‌ దృష్టిలో ఈ కుబేరులే పాలితులు. ఉద్యోగులు, కార్మికులు, సాధారణ ప్రజానీకం లెక్కలో లేరు. కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే ఈ బిల్లు వలన అమెరికా మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కాగా, తృతీయ ప్రపంచ దేశాల్లో సహజవనరులు, చమురు, ఖనిజ నిక్షేపాలు వుండడమే నేరంగా ట్రంప్‌ భావిస్తున్నాడు. గాజా, ఉక్రెయిన్‌, ఇరాన్‌ లపై తన ఆధిపత్యాన్ని ఝళిపిస్తూ ఆయా దేశాలను కొల్లగొట్టేందుకు చేస్తున్న యత్నాలను యావత్‌ ప్రపంచం కళ్లారా చూస్తున్నది. ఇప్పుడు తాజాగా బ్రిక్స్‌ సమావేశంపై ట్రంప్‌ విరుచుకుపడ్డాడు.
ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) శిఖరాగ్ర సమావేశం కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ దేశాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయినా ఆ దేశాలపై అమెరికా వివక్ష కొనసాగిస్తూనే ఉన్నది. వనరుల పంపిణీ, అభివృద్ధి, పర్యావరణ భద్రత వంటి ముఖ్య విషయాల్లో తమని పూర్తిగా విస్మరిస్తున్నట్టు తెలిపాయి. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై తమకు సముచిత గౌరవం లభించడం లేదని కుండబద్దలు కొట్టాయి.
ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి ముఖ్యంగా ట్రంప్‌కు పరోక్ష హెచ్చరికే. గతంలో ఐదు దేశాలకే పరిమితమైన బ్రిక్స్‌ సంఖ్య తాజాగా చేరిన ఇండోనేషియాతో కలిసి పదకొండుకు చేరింది.
సామ్రాజ్యవాదాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం కన్నా ఇలా కలిసి ఎదుర్కోవడం శుభ పరిణామం. ఈ పరిణామాన్ని ట్రంప్‌ ఇప్పుడు సంహించలేకున్నాడు. విషం కక్కుతున్నాడు.
బ్రిక్స్‌ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ట్రంప్‌ ఆరోపించడం ఒక ఎత్తైతే, ఆ కూటమికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తమనించి పది శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవలసి వుంటుందని బెదిరించడం మరో ఎత్తు.
ఇంత వరకు బ్రిక్స్‌ దేశాలు అమెరికాను ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాయో మాత్రం ట్రంప్‌ చెప్పలేదు.
గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ సుంకాలు విధించేది. ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు షరతులతో కూడిన అప్పులిచ్చేవి. ఇప్పుడలా కాకుండా ఏకంగా అన్ని అధికారాలు ట్రంప్‌ గుప్పెట పట్టి చెలరేగిపోతున్నాడు.
అందుకే చైనా, ఇలా సుంకాల విధింపును ఓ ఆయుధంగా వాడుతూ ఇతర దేశాలను లొంగదీసుకోవాలనుకోవడం పిచ్చి భ్రమ అని, దీనిని మేం తప్పక ఎదిరిస్తామని పేర్కొంటూ మండిపడింది.
సామ్రాజ్యవాద దోపిడీని ప్రతిఘటించే దేశాలు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని బలంగా ఆకాంక్షిస్తాయి. ప్రపంచ జి.డి.పి.లో బ్రిక్స్‌ దేశాల వాటా అంతకంతకు గణనీయంగా పెరుగుతున్నది. ఈ వాస్తవం ట్రంప్‌కు అర్థం కానంతవరకు ఘర్షణ అనివార్యంగా ముందుకే పోతుందిగా…

– కె.శాంతారావు,
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -