Friday, April 3, 2026
E-PAPER
Homeనేటి వ్యాసంఆరని విప్లవ జ్వాల

ఆరని విప్లవ జ్వాల

- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.ఒకవైపు నిజాం రాజు నియంతృత్వ పరిపాలన, మరోవైపు గ్రామాల్లో దొరల పెత్తనంతో తెలంగాణ సమాజం నలిగిపోయింది.
ఫలితంగా అక్కడ అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయి. వీటిలో కొన్ని విప్లవ పంథా పట్టాయి.అటువంటి ఉద్యమాలలో తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి.

తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో1927 ఏప్రిల్3న ఒక సాధారణ కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.

అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు.

జనగామ తాలూకాలో విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న 60 గ్రామాలలో ఒకటైన కడివెండి గ్రామంలో దేశ్ ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి దొరసాని అయిన జానకమ్మ నివసించేది. ఆమె ప్రజల పట్ల వ్యవహరించే తీరుకు ప్రజలంతా ఆమెను ఒక రాక్షసి లాగా భావించేవారు. దొడ్డి మల్లయ్యకి, దొరసానికి అనేకమార్లు తగాదాలు జరిగడం వలన దొరసాని దృష్టిలో మల్లయ్య ప్రధాన శత్రువుగా మారాడు.

కడివెండి ప్రజలు ఆంధ్రమహాసభ (సంఘం) అండతో దొరసాని జానకమ్మకు పన్నులు చెల్లించడం ఆపేశారు. దీంతో జానకమ్మ ఆగ్రహానికి అడ్డూ అదుపూ లేకుండా పోయి పన్ను చెల్లించడం ఆపిన వారిపైనా, ముఖ్యంగా జానకమ్మకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. కొమరయ్య తన సోదరుడికి అండగా నిలబడడంతో దొరసాని ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. చివరికి దేశ్ ముఖ్, దొరసాని కలిసి మల్లన్న, కొమరయ్యలను మరియు సంఘం సభ్యులను హత్యచేయించడానికి కిరాయి గూండాలనుపురమాయించారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామసంఘ నాయకులు తమ సభ్యుల ఆత్మరక్షణార్ధం 60 మంది వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.

1946 జూలై 4వ తేదీన ఎలాగైనా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడి జరపాలని పన్నిన కుట్రలో భాగంగా దేశ్ ముఖ్ అనుచరుడు మస్కీన్ అలీ ఆధ్వర్యంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి ప్రవేశించి చీకటి పడే సమయానికి సంఘం కార్యకర్తలను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, రెచ్చగొడూ వారి ఇళ్ళ మీదికి రాళ్ళు రువ్వడం మొదలెట్టారు. దీనికి ధీటుగా సంఘంలో ముఖ్య సభ్యుడు కె.రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు ఏకమై దొరలకు వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రదేశాన్నంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు. వీరితో పాటు కొమరయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిల్చున్నాడు. అంతకు ముందే దొరసాని గడీకి ఎదురుగా ఉన్న పాఠశాల భవనంలో మిష్కిన్ అలీ నాయకత్వంలో మకాం వేసి ఉన్న దేశ్ ముఖ్ కి సంబంధించిన ప్రైవేట్ రక్షణదళం ర్యాలీగా వస్తున్న ప్రజలను చూసి దిగ్ర్భాంతులై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కాల్పులు జరపడం ప్రారంభించగా కొమరయ్య ఆ కాల్పుల్లో గాయపడి మృతి చెందారు.చేసిన పనిని కూడా చెప్పుకోని స్థితిలో ఈనాడు వామపక్ష వాదులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొమరయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది.కొమరయ్య త్యాగం నేటి తరానికి స్ఫూర్తి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
(ఏప్రిల్ 2-అమర వీరుడు దొడ్డి కొమరయ్య జయంతి)
– యం.రాం ప్రదీప్, జెవివి సభ్యులు, తిరువూరు
9492712836

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -