నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజూలా రాజధాని కరాకస్‌పై యూఎస్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో దుస్సాహసానికి దిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్భందించినట్లు ట్రంప్ ప్రకటించాడు. వారిని వెనిజులా నుంచి అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది.
వెనిజులా రాజధాని కారాకస్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అమెరికా దాడులు నిర్వహించింది. పేలుళ్ల తర్వాత భవనాలు మంటల్లో చిక్కుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా మాట్లాడుతూ.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం బయటకు తరలించినట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.
అమెరికా చర్యలను వెనిజుల ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమత్వంపై దాడి అని పేర్కొంది. దేశంలోని చమురు, ఖనిజ సంపదను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా దాడులు చేసినట్లు ఆరోపించింది. దాడుల తర్వాత వెనిజులా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ దాడులను ఇరాన్ సహా పలు అమెరికా వ్యతిరేక దేశాలు ఖండించాయి. కొలంబియా తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఐక్యరాజ్యసమితి, అమెరికన్ స్టేట్స్ ఆర్గనైజేషన్ (OAS) తక్షణమే సమావేశం కావాలని కొలంబియా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.



