Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజేఎన్‌యూలో ఉద్యమ గొంతుకలపై వేటు

జేఎన్‌యూలో ఉద్యమ గొంతుకలపై వేటు

- Advertisement -

ఏడాది పాటు విద్యార్థి నేతల బహిష్కరణ..జరిమానా
ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి:ఎస్‌ఎఫ్‌ఐ
న్యూఢిల్లీ :
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థి ఉద్యమ గొంతుకలపై కక్షగట్టిన యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ పలువురు నేతలపై సస్పెండ్‌ వేటు వేసింది. విద్యార్థులు తమ సమస్యలు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేయకుండా బెదిరింపు చర్యల్లో భాగంగానే యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ ఇలాంటి అప్రజాస్వామ్యక చర్యలకు పాల్పడింది. ఏడాది (రెండు సెమిస్టర్లు) పాటు జేఎన్‌యూఎస్‌యూ నేతలను బహిష్కరించింది. అంతేకాకుండా విద్యార్థి నేతలకు వేలల్లో జరిమానా కూడా విధించింది. క్యాంపస్‌లో నిఘా కెమెరాల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) కార్యనిర్వాహకవర్గం పాత్ర ఉందని ఆరోపిస్తూ మాజీ యూనియన్‌ అధ్యక్షుడితో సహా, జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యులను సస్పెండ్‌ చేసింది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అసమ్మతిపై ఈ చర్యను ”ప్రతీకార రాజకీయాలు”గా అభివర్ణించాయి. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ తీసుకున్న ఈ చర్యను ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడిగా ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.

జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికా బాబు, ప్రధాన కార్యదర్శి సునీల్‌ యాదవ్‌, సహాయ కార్యదర్శి డానిష్‌ అలీ, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షులు నితీష్‌ కుమార్‌ లపై కేసు నమోదు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టి) ఆధారిత యాక్సెస్‌ గేట్లు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని విశ్వవిద్యాలయం పరిపాలన విభాగం ఆరోపించింది. గత ఏడాది నవంబర్‌లో లైబ్రరీలు, తరగతి గదులతో సహా విద్యా ప్రదేశాలలో ”సామూహిక నిఘా” ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన సంఘటనపై జరిగిన ఒక ప్రొక్టోరియల్‌ విచారణ తరువాత ఈ క్రమశిక్షణా చర్య తీసుకున్నట్లు యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది. చీఫ్‌ ప్రొక్టర్‌ ఎన్‌. జనర్థన్‌ రాజు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ స్టడీస్‌ నుండి పీహెచ్‌డీ స్కాలర్‌ అయిన నితీష్‌ కుమార్‌ను రెండు సెమిస్టర్ల పాటు బహిష్కరించి, తక్షణమే జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించారు. విశ్వవిద్యాలయ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలపై ఆయనకి రూ.29,000 జరిమానా కూడా విధించారు.

నిరసన సందర్భంగా నితీష్‌ కుమార్‌ ఫర్నిచర్‌ పై ఎక్కి సీసీటీవీ వైర్లను కత్తిరించారని, ఎఫ్‌ఆర్‌టీ యంత్రాల ప్యానెల్‌లను కూల్చివేశారని, భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆ ఉత్తర్వులో ఆరోపించారు. ”2025 నవంబర్‌ 21న లైబ్రరీలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టి) ఆధారిత యాక్సెస్‌ గేట్లను ధ్వంసం చేసినందుకు నితీష్‌ కుమార్‌ దోషిగా తేల్చారు. ”ఆయన అదితి మిశ్రా, గోపికా బాబు, సునీల్‌ యాదవ్‌, డానిష్‌ అలీలతో కలిసి ఎఫ్‌ఆర్‌టి వ్యవస్థను ధ్వంసం చేశాడు” అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే, విద్యార్థి నేతలు ఈ ఆరోపణలను తిరస్కరించారు. నిరసన శాంతియుతంగా జరిగిందని, విద్యా ప్రదేశాలలో పెరుగుతున్న నిఘా సాంకేతికతల వినియోగాన్ని వ్యతిరేకించడంపై దష్టి సారించారని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు క్యాంపస్‌లో గోప్యత, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను రాజీ పడుతున్నాయని పేర్కొన్నారు. డానిష్‌ అలీ మాట్లాడుతూ జేఎన్‌యూఎస్‌యూ ఆఫీసు బేరర్లకు క్రమశిక్షణా ఆదేశాలు అందాయని అన్నారు. ”మాకు వర్శిటీ నుండి ఇప్పుడే ఆదేశాలు వచ్చాయి. మేము దీనిపై చర్చించి ఆందోళనకు సిద్ధం అవుతాం. విద్యార్థులంతా ఈ అప్రజాస్వామ్యక చర్యలపై ఐక్యంగా ఆందోళన చేస్తారు” అని ఆయన అన్నారు.

జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ కూడా విశ్వవిద్యాలయం నిర్ణయంపై తన విచారాన్ని వ్యక్తం చేశారు. తనకు రూ. 29,000 జరిమానా విధించబడిందని, ఈ జరిమానా తన కోర్సు రెండో సెమిస్టర్‌కు నమోదు చేసుకోకుండా నిరోధించిందని ఆయన పేర్కొన్నారు. ”జరిమానా కారణంగా, నేను తదుపరి సెమిస్టర్‌కు నా రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయలేను” అని ఆయన పేర్కొన్నారు. శాంతియుత ఆందోళన అయితే, విద్యార్థి నాయకులు యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ చేసిన ఆరోపణలను తిరస్కరించారు. తమ ఆందోళన శాంతియుతంగా జరిగిందని, విద్యా రంగాలలో పెరుగుతున్న నిఘా సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని వ్యతిరేకిస్తూౖ ఆందోళన చేశామని అన్నారు. ఈ ఉత్తర్వులను ”విద్యార్థి వ్యతిరేక” మరియు ”ప్రజాస్వామ్య విరుద్ధం” అని పిలుస్తూ, విద్యార్థుల ఆందోళనలను లేవనెత్తినందుకు ఎన్నికైన ప్రతినిధులను తొలగించడానికి పరిపాలన ప్రయత్నిస్తోందని యూనియన్‌ వాదించింది. జేఎన్‌యూఎస్‌యూని కూల్చివేసే ఎజెండాతో చేసిన కుట్రలను యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ చేసిన ఆదేశాలు ప్రతిభింభిస్తున్నాయని పేర్కొంది. రాజకీయ వ్యక్తీకరణను లేదా విద్యార్థి కార్యకలాపాలను అరికట్టడానికి క్రమశిక్షణా విధానాలను ఉపయోగించలేరని విమర్శించింది.

సంఘీభావం కోసం పిలుపు
”క్యాంపస్‌ రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్న దాడి”కి వ్యతిరేకంగా విద్యార్థులు, మద్దతుదారులు సంఘీభావంగా నిలబడాలని జేఎన్‌యూఎస్‌యూ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య మార్గాలతో ఆదేశాలను వ్యతిరేకించడం కొనసాగిస్తామని పేర్కొంది. ”ఇది పరిపాలనను ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం” అని స్పష్టం చేసింది.

ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ
జేఎన్‌యూఎస్‌యూ ఆఫీస్‌ బేరర్లకు అందజేసిన బహిష్కరణ నోటీసును, అలాగే వారిపై జారీ చేసిన బహిష్కరణ ఆర్డర్‌లను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. బహిష్కరణకు గురైన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి, జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షురాలు గోపిక బాబు కూడా ఉన్నారని తెలిపింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం సాజీ, శ్రీజన్‌ భట్టాచార్యలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జేఎన్‌యూ అధ్యక్షురాలు, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కౌన్సిలర్‌ ఉత్స, ఎస్‌ఏఏ కౌన్సిలర్‌ దివ్య, మాజీ ఎస్‌ఏఏ కౌన్సిలర్‌ కష్ణప్రియలకు రూ.19,000 భారీ జరిమానాలు విధించారని తెలిపారు. ఆదేశాలు, జరిమానాలకు సంబంధించి జేఎన్‌యూ పరిపాలన విభాగం తీసుకున్న అప్రజాస్వామ్యక చర్యలు జేఎన్‌యూ విద్యార్థి సంఘం సమిష్టి ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ అణిచివేత సమయం పరిపాలన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుందని అన్నారు. యూజీసీ ప్రమోషన్‌ ఆఫ్‌ ఈక్విటీ రెగ్యులేషన్స్‌-2026 నిలుపుదలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్న కీలకమైన సమయంలో ఈ అణిచివేత చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కాబట్టి ఈ చర్యను విద్యార్థుల సమిష్టి ప్రతిఘటనను విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నంగా చూడాలని అన్నారు. ఎన్నికైన విద్యార్థి నేతలను బహిష్కరించడం జేఎన్‌యూ విద్యార్థి వ్యతిరేక ఎజెండాను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కు తొత్తుగా తనను తాను పూర్తిగా ప్రదర్శించుకుందని విమర్శించారు. జేఎన్‌యూ పరిపాలన విభాగం ఇటీవల ఈ రకమైన ‘క్రమశిక్షణా చర్యలను’ సాధారణీకరిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అసమ్మతిని ప్రజాస్వామ్యంగా ప్రదర్శించినందుకు విద్యార్థులపై జరిమానాలు విధించడానికి పాల్పడుతోందని విమర్శించారు. ఈ చట్టవిరుద్ధమైన, నియంతత్వ పాలన భారాన్ని అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇద్దరూ ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ పోలీసింగ్‌ తో ప్రజాస్వామ్య స్వరాలను, సామూహిక అసమ్మతిని అరికట్టే స్పష్టమైన ఎజెండాను కలిగి ఉందని విమర్శించారు. సామూహిక ప్రతిఘటన, విద్యార్థి ప్రజాస్వామ్యంపై లక్ష్యంగా చేసుకున్న ఈ దాడికి వ్యతిరేకంగా దేశంలోని మొత్తం విద్యార్థి లోకం, ప్రజాస్వామ్య శక్తులు జేఎన్‌యూ విద్యార్థులతో సంఘీభావంగా నిలబడాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -