– ‘యూరియా’ అనగానే ఉలిక్కిపడుతున్న వైనం
– అక్కరకు రాని కేంద్రమంత్రి పదవి
– మోడీపై ఒత్తిడి తేలేక ముఖంచాటు
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సకాలంలో వర్షాలు కురిసి, పంటలు ఆశాజనకంగా ఉన్న తరుణంలో రాష్ట్ర రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎరువుల కోసం సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్న రైతులు తమ కష్టాల్ని పట్టించుకోని స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై రైతులు, విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి, కేంద్రమంత్రిగా ఉన్న రాష్ట్ర నాయకుడు ఇక్కడి రైతాంగానికి అవసరమైన యూరియాను తెప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. కేవలం మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప చేతలేం లేవని ఎద్దేవా చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన కేంద్రమంత్రి తనకేం పట్టనట్టు మౌనంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలపై కూడా ఆయన చొరవ చూపడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘యూరియా’ బండి సంజయ్‌కు రాజకీయంగా సవాళ్లు విసురుతోంది.
కరీంనగర్ జిల్లాలో 15,139 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఈ నెలారంభంలో 728 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు అవి కూడా అయిపోయాయి. వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు యూరియా వేయలేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ రైతులు తెల్లవారుజామునే సొసైటీలు, ఆగ్రో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడలేక చెప్పులను పెట్టి పక్కన నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల యూరియా లారీలను అడ్డుకుని ఆందోళనలు చేస్తున్నారు. కొంతమంది రైతులు ‘యూరియా ఇవ్వకుంటే పురుగుల మందు ఇవ్వండి, తాగి చస్తాం’ అంటూ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ మరమ్మతులతో ఆగిన ఉత్పాదన
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో తరచుగా మరమ్మతులు తలెత్తడం యూరియా కొరతకు మరో కారణం. ఈ ఫ్యాక్టరీలో ప్రతి నెలా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉన్నా, నిర్వహణ లోపాలతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. తరచుగా షట్‌డౌన్‌లు, పైప్‌లైన్ లీకేజీలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్పొరేట్ కార్యాలయం నోయిడాలో ఉండటం వల్ల పర్యవేక్షణ, సమన్వయం సరిగా లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల ఉత్పత్తి తగ్గి, రాష్ట్రానికి రావాల్సిన వాటా 50 శాతం కూడా అందడం లేదు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవడం లేదు. కనీసం కేంద్రంతో మాట్లాడి ఆ పరిశ్రమ నడిచేందుకు ఎదురవుతున్న ప్రతికూల అంశాలపై పరిష్కారం చూపడం లేదు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఇది తన పరిధిలోని సమస్య కాదన్నట్టే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.
రాష్ట్రానికి కావాల్సిన యూరియా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రాన్ని కలిసినా స్పందన లేదు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజరు ఈ విషయంలో ఎలాంటి చొరవా చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం పార్లమెంట్‌లో కూడా తెలంగాణకు సంబంధించిన సమస్యలపై మాట్లాడే అవకాశం వచ్చినా, ఆయన మాత్రం మౌనంగా ఉండటం పట్ల కరీంనగర్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం తప్ప, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పరిశ్రమలు, ఉపాధి హామీ నిధుల వంటి కీలక అంశాలపై ఆయన దృష్టి సారించడం లేదని చెప్తున్నారు.
ఫెయిల్యూర్ కేంద్రమంత్రి
మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి
రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడం, ప్రాజెక్టుల విషయంలో కరీంనగర్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణకు రావాల్సిన ఉపాధి హామీ నిధులు, సీసీఐ నిధులు, ఐఐఐటీ, నవోదయ వంటి సంస్థల విషయంలోనూ ఆయన ఎలాంటి కృషి చేయడం లేదు. బండి సంజరు మాటలకే పరిమితం. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, అబద్ధాలు చెప్పడం తప్ప, రాష్ట్రానికి ఏమీ సాధించి పెట్టలేకపోయారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన, యూరియా కొరతపై మాత్రం నోరు మెదపడం లేదు. బీజేపీ అసలు రూపాన్ని జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
‘బండి’ కనిపించడేం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES