నవతెలంగాణ-హైదరాబాద్: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) నుంచి 30 కోట్ల రూపాయల పాలసీదారుల పొదుపు మొత్తాన్ని అదానీ గ్రూప్‌కు మళ్లించడానికి ఈ ఏడాది మే నెలలో భారత అధికారులు ప్రయత్నించారని, ఆ విధమైన ప్రయత్నాలు చేశారని ది వాషింగ్టన్ పోస్ట్ చేసిన నివేదిక సంచలనంగా మారింది. అయితే ఈ నివేదికను ఎల్‌ఐసి తోసిపుచ్చింది. ఇవి తప్పుడు ఆరోపణలుగా ఎల్‌ఐసి స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఎల్‌ఐసి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎల్‌ఐసి స్థిరత్వంతో తీసుకునే నిర్ణయ ప్రక్రియను హానిచేసే ఉద్దేశంతోనే, ఎల్‌ఐసికున్న కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇలాంటి ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తున్నాయని ప్రకటనలో ఎల్‌ఐసి సంస్థ తెలిపింది.
ఎల్‌ఐసి అనేది భారతదేశంలో బలమైన ఆర్థికరంగ పునాది. ఎల్‌ఐసి పెట్టుబడి నిర్ణయాలు బాహ్యకారకాలచే ప్రభావితమవుతాయని వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు అబద్ధం. నిరాధారమైనవి. సత్యానికి దూరంగా ఉన్నాయి. ఎల్‌ఐసి ద్వారా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలోకి నిధులను చొప్పించడానికి ఎల్‌ఐసి ప్రయత్నించిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాసం పేర్కొంది.
అయితే వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో ఆరోపించినట్టుగా అదానీ కంపెనీల్లో పెట్టుబడుల కోసం ఎటువంటి పత్రాన్ని కానీ, ప్రణాళికను కానీ ఎప్పుడూ సిద్ధం చేయలేదని ఎల్‌ఐసి పేర్కొంది. బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం.. వివరణాత్మక పరిశీలన తర్వాత పెట్టుబడి నిర్ణయాలను ఎల్‌ఐసి స్వతంత్రంగా తీసుకుంటుంది. ఆర్థిక సేవల విభాగం లేదా మరే ఇతర సంస్థకు అలాంటి నిర్ణయాలలో ఎటువంటి పాత్ర లేదు. ఎల్‌ఐసి అత్యున్యత ప్రమాణాలను నిర్ధారించింది. పెట్టుబడి నిర్ణయాలన్నీ ప్రస్తుత విధానాలు, చట్టాలలోని నిబంధనలు, నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా, దాని వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా తీసుకోబడతాయి అని ఎల్‌ఐసి ప్రకటన పేర్కొంది.



