Friday, May 2, 2025
Homeఅంతర్జాతీయంకదం తొక్కిన కార్మిక లోకం

కదం తొక్కిన కార్మిక లోకం

– ట్రంప్‌ విధానాలపై కన్నెర్ర
– ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ర్యాలీలు
– మేడే రోజు పలు ఆందోళనలు
– పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు, కార్మికులు
– హక్కులు, డిమాండ్లపై గొంతెత్తిన యూనియన్లు
పారిస్‌:
మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. తమ హక్కులు, డిమాండ్ల కోసం గొంతెత్తింది. ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలతో హౌరెత్తించింది. ఇటు.. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చి తన దూకుడు విధానాలతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన విధానాలకు వ్యతిరేకంగా మేడే రోజు పలు దేశాల్లో ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. పలు దేశాలు, నగరాల్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. ట్రంప్‌ అనుసరిస్తున్న తీరు, విధానాల పట్ల తమ వ్యతిరేకతను ఈ ఆందోళనల ద్వారా వెలిబుచ్చారు. ప్రపంచ రాజకీయాలను ‘ట్రంపైజేషన్‌’ చేయటాన్ని ఫ్రెంచ్‌ యూనియన్‌ నాయకులు ఖండించారు. ట్రంప్‌ను పోలి ఉన్న బొమ్మను టురిన్‌ వీధుల గుండా ఊరేగించారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభ భయాలను రేకెత్తిస్తున్న దూకుడు సుంకాల నుంచి వలసల అణచివేతల వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎజెండాపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన నిరసనల్లో వామపక్ష నాయకుడు జీన్‌-లూక్‌ మెలెన్‌చాన్‌ కనిపించారు. ఐరోపాలో అమెరికా సైనిక, వాణిజ్య ప్రభావంపై పెరుగుతున్న ఆగ్రహం ఇందులో ప్రతిబింబించింది. ప్రపంచ అస్థిరతలో అమెరికా పాత్రను ఖండించే ప్రసంగాలలో ఈ థీమ్‌ ప్రతిధ్వనించింది.
‘ట్రంప్‌ సుంకాలతో ప్రజల జీవనోపాధికి దెబ్బ’
ట్రంప్‌ హయాంలోని కొత్త సుంకాలను తైవాన్‌ అధ్యక్షుడు లై చింగ్‌-టే ఎత్తి చూపారు. టారిఫ్‌ యుద్ధాలు, ట్రంప్‌ విధానాలు స్థానిక పరిశ్రమలు, ప్రజల జీవనోపాధిని బెదిరిస్తాయని ఫిలిప్పిన్స్‌లో నిరసన చేస్తున్న నాయకుడు మోంగ్‌ పలాటినో అన్నారు. జపాన్‌లోని టోక్యోలోనూ ఆందోళనలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఒక మార్చ్‌లో ట్రంప్‌నుపోలి ఉండేలా తయారు చేసిన బొమ్మ రోజంతా కనిపించింది. అక్కడి ప్రదర్శనకారులు అధికవేతనాలు, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, విపత్తు ఉపశమనం, గాజాలో కాల్పుల విరమణ, ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ముగించాలని పిలుపునిచ్చారు. దిగుమతి చేసుకున్న ముడి పదార్థాల ధర పెరుగుతుందని తాను భయపడుతున్నానని యూనియన్‌ నిర్మాణ కార్మికుడు తడాషి ఇటో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో పాల్గొన్న రెండు లక్షల మంది..
తైపీలో పలు రంగాలకు చెందిన 2500 మంది యూనియన్‌ సభ్యులు అధ్యక్ష కార్యాలయం నుంచి కవాతు చేశారు. ట్రంప్‌ విధించే సుంకాలు ఉద్యోగాలు కోల్పోవటానికి దారి తీయొచ్చని నిరసనకారులు హెచ్చరించారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో వేలాది మంది కార్మికులు అధ్యక్ష భవనం దగ్గర ర్యాలీ చేశారు. అక్కడి పోలీసులు బారీకేడ్లతో నిరసనకారులను అడ్డుకున్నారు. కార్మికులు వేతనాల పెంపుదల, స్థానిక ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు బలమైన రక్షణకు డిమాండ్‌ చేశారు. ఇండోనేషియాలోని జకార్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నేషనల్‌ మాన్యుమెంట్‌ పార్క్‌ వద్ద ప్రజలు, కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రభుత్వం ఇండోనేషియా నుంచి పేదరికాన్ని నిర్మూలించటానికి వీలైనంతగా కష్టపడి పని చేస్తుందని చెప్పారు. మేడే రోజు ర్యాలీలలో దాదాపు రెండు లక్షల మంది కార్మికులు పాల్గొని ఉండొచ్చని ఇండోనేషియా ట్రేడ్‌ యూనియన్ల సమాఖ్య అధ్యక్షుడు సయీద్‌ ఇక్బాల్‌ తెలిపారు. వారి డిమాండ్లలో వేతన పెంపుదల, అవుట్‌సోర్సింగ్‌కు ముగింపు, గృహ మరియు వలస కార్మికులకు బలమైన రక్షణలు వంటివి ఉన్నాయి.
టర్కీలో పదివేల మందితో ర్యాలీ
టర్కీలో మేడే సందర్భంగా కార్మిక హక్కులతో పాటు ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టటానికి విస్తృత పిలుపులకు వేదికైంది. ఇస్తాంబుల్‌లోని కడికోరులో పదివేల మంది ర్యాలీ కోసం గుమిగూడారు. ఇస్తాంబుల్‌ ప్రతిపక్ష మేయర్‌ ఎక్రెమ్‌ ఇమామోగ్లును జైలులో పెట్టటాన్ని వారు వ్యతిరేకించారు. అధికారులు సెంట్రల్‌ ఇస్తాంబుల్‌కు రాకపోకలను అడ్డుకున్నారు. రవాణా మార్గాలను మూసివేశారు. తక్సిమ్‌ స్క్వేర్‌ సమీపంలో మధ్యాహ్నం 400 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్‌ చేశారనీ, వీరిలో న్యావాదులూ ఉన్నారని లా అసోసియేషన్‌ తెలిపింది.
మేడే కార్యక్రమాలకు: లాజ్‌ ఏంజిల్స్‌ ఆతిథ్యం
ట్రంప్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రపంచంలోనే అతిపెద్ద మేడే కార్యక్రమాల్లో ఒకదానికి లాస్‌ ఏంజిల్స్‌ ఆతిథ్యం ఇవ్వనున్నది. వ్యాపారవేత్తలు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న విధానా పట్ల పెరుగుతున్న నిరాశను నిరసనలు ప్రతిబింబిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక, విద్యార్థి సంఘాలు, అట్టడుగు వర్గాల సంకీర్ణాలు వందలాది ర్యాలీలను ప్లాన్‌ చేశాయి. ”భయం, అబద్ధాలతో మమ్మల్ని విభజించటానికి ప్రయత్నిస్తున్న బిలియనీర్లు, రాజకీయ నాయకులపై మేం పోరాటం చేస్తున్నాం. మాకు నిజం తెలుసు.
వలసకార్మికులపై దాడి అందరు కార్మికులపై దాడి..” అని 20 లక్షల మంది కార్మికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యయూనియన్‌ అధ్యక్షుడు ఏప్రిల్‌ వెరెట్‌ అన్నారు. అమెరికాలోని చికాగో, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియాతో సహా యూఎస్‌ అంతటా ర్యాలీలు జరగనున్నాయని తెలుస్తున్నది. యూఎస్‌లో నిర్వాహకులు ఈ ఏడాది నిరసనలను లేబర్‌ ప్రొటెక్షన్స్‌(కార్మిక రక్షణలు), వైవిధ్య కార్యక్రమాలు, సమాఖ్య ఉద్యోగులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనగా రూపొందించారు.
నేపాల్‌లోని ఖాట్మండ్‌లో మేడే ర్యాలీలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌)తో అనుబంధంగా ఉన్న కార్మికులు పాల్గొన్నారు. ఇరాక్‌, పాకిస్తాన్‌లలోని పలు నగరాల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. జర్మనీలో, పనిదినాలు పొడిగించటం, వలస వ్యతిరేక భావన పెరగటం కార్మిక రక్షణలను నాశనం చేస్తున్నాయని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. స్విట్జర్‌లాండ్‌లో వేలాది మంది ఫాసిజం, యుద్ధాన్ని ఖండిస్తూ బ్యానర్లతో కవాతు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img