Saturday, June 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅప్పుడలా..ఇప్పుడిలా..!

అప్పుడలా..ఇప్పుడిలా..!

- Advertisement -

– ప్రతిపక్షంలో పోరాటం..అధికారంలోకి వచ్చాక మొహమాటం
– ఘన్సీమీయాగూడలో రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా
– ఆక్రమించిన భూముల రక్షణకు అధికార పార్టీ గూటికి పెద్ద తలకాయలు
– ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, బడాబాబులే కీలకం
– పాలకపక్షంతో అంటకాగుతున్న వైనం..
– భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్న భూ బాధితులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కాపాడాలని పోరాటాలు చేశారు. ఏకంగా ఆ భూముల్లో నాగలి కట్టి దున్నారు. ఇప్పుడు ఆ నేతలే అధికారంలోకి వచ్చారు. పవర్‌లో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం పాలక పార్టీలకు షరా మామూలుగా మారింది. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతున్న భూ కబ్జాదారులకు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతోంది. వారి దోపిడీకి అంతేలేకుండా పోతోంది. ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం కబ్జాదారులు ‘పార్టీ కండువా’ మార్చడమేనని రంగారెడ్డి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. శంషాబాద్‌ మండలం ఘన్సీమీయాగూడలో ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రభుత్వ మౌనంపై ఆంతర్యమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ఘన్సీమీయాగూడ రెవెన్యూ పరిధిలో రెండు సర్వే నెంబర్లు మాత్రమే ఉన్నాయి. సర్వే నెంబర్‌ 3లో కొంత పట్టా భూములు ఉండగా.. కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఇక సర్వే నెంబర్‌ 4.. పూర్తిగా ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే ఈ గ్రామానికి ఇప్పటికీ ‘నక్ష’ లేదు. ఈ భూములన్నీ నిజాం ప్రభుత్వం తమ అవసరాల కోసం పెట్టుకున్న భూములు. నిజాం అనంతరం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భూములను సాగు చేసుకోవడానికి పేదలకు ఇచ్చారు. కొంత మందికి సర్వే నెంబర్‌ 3లో పట్టాలు కూడా ఇచ్చారు. ఈ భూములను క్రయ విక్రయాలు చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.కలెక్టర్‌ జిల్లా రిజిస్ట్రార్‌, ఇటీవల స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్నతాధికారులకు సర్వే నెంబర్‌ 4లో ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించిందని, ఎవరికి కూడా రిజిస్ట్రేషన్‌ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నెంబర్‌లోని భూములను 22(ఎ) కింద చేర్చాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అయితే ఈ ప్రాంతంలో రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు ఉండటంతో ఈ భూములపై బడాబాబుల కన్నుపడింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం సుమారు రూ.15 కోట్లు పలుకుతోంది. దాంతో ఈ భూములను కాజేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు.
కండువా మార్చితే అంతా మామూలే..
ప్రభుత్వ భూములను కబ్జాపెట్టిన ఆ బడాబాబులు వాటిని దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారడానికి సిద్ధమవుతున్నారు. ఘన్సీమీయాగూడ సర్వే నెంబర్‌ 4లోని ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ పెద్ద మనిషి పేదలకు నయానో భయానో ఇచ్చి భూములు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆవ్యక్తి పార్టీలు మారడంలో దిట్ట. ఆపర చాణుక్యునిగా పేరుంది. సుమారు రూ.180 కోట్ల విలువ గల 12 ఎకరాల భూమిని స్వాహా చేశారని స్థానికంగా ఉన్న ఆయా పార్టీల్లో ఉన్న నేతలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇదే సర్వే నెంబర్‌లో 200 ఎకరాలు సుమారు రూ. 3 వేల కోట్ల విలువ గల భూములను ఓ బడా పారిశ్రామికవేత్త కబ్జా పెట్టారు. ఆయనకు గోల్ట్‌ అనే బిరుదు కూడా ఉందని అంటున్నారు. మరో ప్రజాప్రతినిధి సుమారు 20 ఎకరాల భూమిని కబ్జా పెట్టి ఏకంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. వీటిని కాపాడుకోవడానికి ఆ నేతలు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి చేరి, సదరు భూములను వశం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములే కబ్జాపెడుతుంటే.. అధికారంలో ఉన్నవారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారులు పార్టీ మారడమే ప్రభుత్వ పెద్దల మౌనానికి కారణామని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలోనే పోరాటం చేస్తారా.. అధికారంలో ఉంటే కబ్జాదారులకు వత్తాసు పలుకుతారా.. అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆ భూములు ప్రభుత్వానివేనన్న అధికారులు
ఆ భూములు ప్రభుత్వానివేనని, క్రయవిక్రయాలు జరగకూడదని అధికారులు చెబుతున్నారు. 22(ఎ) కింద చేర్చాలని రెవెన్యూ అధికారులకు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్టర్‌ అధికారులకు కలెక్టరే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా అవసరాల కోసమే ఆ భూములు ఉపయోగించాలని అధికారులు చెబుతున్నారు.
ఆ భూములు పేదలకు పంచాలి
ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని పోరాటం చేసిన వారే ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన మాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. కానీ ఈ భూములు కొట్టేసిన నాయకులు ప్రస్తుతం ప్రభుత్వ పంచన చేరారు. ఆ నాయకులను చూసి మా పేదలకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నాం. ఈ పేదల భూములు బడాబాబులు చేతుల్లోకి పోకుండా కాపాడాలని కోరుతున్నాం.
– చిలకమర్రి నరసింహ, స్థానికులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -