– కానీ బీజింగ్‌ను అస్థిరపరచను
– ట్రంప్ బీరాలు
వాషింగ్టన్ : తమ వద్ద చైనాను నాశనం చేయగల అనూహ్యమైన, అద్భుతమైన వ్యూహాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. బీజింగ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో వాషింగ్టన్ శక్తి సామర్ధ్యాలను ఆయన ఏకరువు పెట్టారు. ‘వారి వద్ద కొన్ని వ్యూహాలు ఉన్నాయి. కానీ మా వద్ద అనూహ్యమైన వ్యూహలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్‌తో సోమవారం సమావేశం కావడానికి ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘అయితే నేను ఆ వ్యూహాలను అమలు చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ నేను ఆ పని చేస్తే అవి చైనాను నాశనం చేస్తాయి. కాబట్టి ఆ అస్త్రాలను వదలదలచుకోలేదు’ అని తెలిపారు. చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదంలో తమదే పైచేయి అయినప్పటికీ ఆ దేశాన్ని అస్థిరపరిచే చర్యలేవీ చేపట్టబోనని బీరాలు పలికారు. బీజింగ్ కనుక తమకు రేర్ ఎర్త్ మాగెట్ల సరఫరా కొనసాగించని పక్షంలో 200 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ బెదిరించారు. రేర్ ఎర్త్ ఎగుమతులపై ఏప్రిల్‌లో చైనా ఆంక్షలను కఠినతరం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని, బీజింగ్ వెళ్లాలని అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. బహుశా ఈ ఏడాది ఎప్పుడో ఒకప్పుడు చైనాలో పర్యటిస్తానని అన్నారు. బీజింగ్‌తో సత్సంబంధాలనే వాషింగ్టన్ కోరుకుంటోందని తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, చైనా దేశాలు ఈ నెల 12న అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నారు. ఏప్రిల్ నుంచి చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచుకుంటూనే పోతోంది. చివరికి అవి గరిష్టంగా 145 శాతానికి చేరాయి. చైనా నుంచి వస్తున్న అనేక వస్తువులపై ప్రస్తుతం 30 శాతం టారిఫ్ విధిస్తున్నారు. చైనా కూడా అమెరికా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తోంది.
ఉత్తుత్తి బెదిరింపులే…క్రియ శూన్యం
రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ దుందుడుకు విధానాన్ని అవలంబించారు. ఒక దశలో చైనాపై 145 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. వాస్తవానికి ట్రంప్‌వి ఉత్తుత్తి బెదిరింపులేనని, క్రియ శూన్యమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ 145 శాతం విధిస్తే చైనా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 125 శాతం టారిఫ్ వడ్డించింది. దీంతో ట్రంప్ కంగుతిన్నారు. జిన్‌పింగ్ వద్ద తాను ఊహించిన దాని కంటే ఎక్కువ అస్త్రాలే ఉన్నాయని అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి చైనా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చైనాపై విధించిన గరిష్ట సుంకాలను కూడా ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజీలో ఉంచారు.
మేకపోతు గాంభీర్యమే
చైనా కనుక రేర్ ఎర్త్ ఖనిజాలను సరఫరా చేయకపోతే 200 శాతం వరకూ సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తాజాగా చేసిన బెదిరింపు ట్రంప్ మేకపోతు గాంభీర్యంలో భాగమే. ప్రపంచంలో కీలకమైన రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా మొత్తం దాదాపుగా చైనా నుంచే జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సైనిక వస్తువులను ఉత్పత్తి చేయాలంటే అమెరికాకు ఇవి చాలా అవసరం. అంటే మాగెట్ల కోసం అమెరికా విధిగా చైనా పైనే ఆధారపడాల్సి ఉంటుంది. బీజింగ్ విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్న ట్రంప్ ఓ వైపు ఆంక్షలు, టారిఫ్‌లు అని హెచ్చరిస్తూనే మరోవైపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికాలో విద్యాభ్యాసం కోసం ఆహ్వానించారు. చైనాకు అత్యాధునిక చిప్స్‌ను విక్రయించేందుకు అమెరికా కంపెనీ న్విడియాను ఈ నెల 11న అనుమతించారు. చైనా కంపెనీకి చెందిన ఆన్‌లైన్ వీడియో వేదిక టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని కూడా నిలిపివేశారు.
చైనాపై ఆధారపడక తప్పదు
చైనాతో సత్సంబంధాలు నెరపుకోవడం మినహా అమెరికాకు ప్రస్తుతం మరో దారి లేదు. ఎందుకంటే చైనా నుంచి జరుగుతున్న సరఫరాల పైనే అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా కీలకమైన ఖనిజాలు, మిడ్-టెక్ తయారీలో చైనాదే అగ్రస్థానం. చైనాపై కేవలం సుంకాలు విధించినంత మాత్రాన అమెరికా చేసేదేమీ లేదు. చైనాతో అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 2024లో 295.5 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 5.7 శాతం అదనం. కేవలం దిగుమతులే 438.7 బిలియన్ డాలర్లు ఉండగా ఎగుమతులు 143.2 బిలియన్ డాలర్ల మేర జరిగాయి. మొత్తంగా చూస్తే లోటు 263 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. అధిక సుంకాలు విధించినంత మాత్రాన చైనాపై ఆధారపడక తప్పడం లేదు. చైనా ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక యంత్రాలతో పాటు బొమ్మలు, దుస్తులు, ఫర్నీచర్ వంటి వినియోగ వస్తువులు అమెరికాకు ఎక్కువగా సరఫరా అవుతున్నాయి.
వియత్నాం, మెక్సికో నుంచి దిగుమతులను పెంచుకుందామని అమెరికా ప్రయత్నించినప్పటికీ అక్కడ అవసరమైన మేర ఉత్పత్తి జరగడం లేదు. పైగా చైనాపై విధించిన సుంకాల కారణంగా అమెరికా వినియోగ ధరలు 2.3 శాతం పెరిగాయి. కుటుంబాలు సగటున 3,800 డాలర్ల మేర కొనుగోలు శక్తిని కోల్పోయాయి.
చైనాను నాశనం చేసే పాచికలున్నాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES