– వరుస దాడులతో సంభవించే మరణాల కంటే అధికం
– గాజాలో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు
– ఆహార సరఫరాను ఇజ్రాయిల్ అడ్డుకోవటంతోనే ఈ దుస్థితి
గాజా: ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. గాజాపై ఇజ్రాయిల్ సైన్యం వరుస దాడులకు పాల్పడుతూనే ఉన్నది. ఈ దాడులతో ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులూ ఉన్నారు. తాజాగా ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడుల వల్ల 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 125 మంది గాయాలపాలయ్యారు. గాజా ఆరోగ్య మంత్రత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గాజాలో ఆకలి చావులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇక్కడ ఇజ్రాయిల్ సైన్యం దాడుల వల్ల మరణించినవారు కొందరైతే.. ఆకలికి తట్టుకోలేక మరెంతో మంది చనిపోతున్నారు. అక్కడి మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. గాజాపై దాడులకు తెగబడటమే కాకుండా.. ఆహార సరఫరానూ అడ్డుకుంటూ ఇజ్రాయిల్ పైశాచికానందాన్ని పొందుతున్నది. ఇజ్రాయిల్ సైన్యం చర్యలు గాజాలో వేలాది మంది ప్రజల ఆకలి చావులకు కారణమవుతున్నది. ప్రస్తుతం 290,000ల మంది చావుకు దగ్గరగా ఉన్నారని గాజా మీడియా తెలిపింది. వీరిలో దాదాపు ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు సుమారు 3,500 మంది ఉండటం ఆందోళనను కలిగిస్తున్నది.గాజా విషయంలో ఇజ్రాయిల్ అమానవీయ తీరుపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. దాడులు ఆపి, శాంతి వైపునకు పయనించాలని సూచిస్తున్నది. కానీ, నెతన్యాహు యంత్రాంగం ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. అమాయకుల ప్రాణాలను బలిగొంటూ పైశాచికానందాన్ని పొందుతున్నదని మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
ఆకలి చావులు ఎక్కువే..!
- Advertisement -
- Advertisement -