Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం'నో' చెప్పేందుకు అధికారాలున్నాయి

‘నో’ చెప్పేందుకు అధికారాలున్నాయి

- Advertisement -

– రాష్ట్రపతి ప్రస్తావనపై ఎన్డీయే పాలిత రాష్ట్రాల వాదనలు
న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు నిర్దిష్ట కాలపరిమితులు విధించవచ్చా లేదా అనే అంశమై స్పష్టత నివ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత న్యాయస్థానానికి పంపిన ప్రశ్నలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవారు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ నెల 21నే తన వాదనలు ముగించారు. మహారాష్ట్ర, గోవా, హర్యానా, చత్తీస్‌ఘడ్‌, పుదుచ్చేరి సహా ఎన్డీఏ పాలనలో వున్న రాష్ట్రాల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఇలా కాలపరిమితిని విధించడం రాజ్యాంగ సంస్థకు ఇచ్చిన విచక్షణా అధికారాల స్ఫూర్తికి వ్యతిరేకమని వాదించారు. తిరిగి ఈ కేసుపై విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు తమ వాదనలు వినిపిస్తాయని భావిస్తున్నారు.
పుదుచ్చేరి ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది వినరు నవరె రాష్ట్రపతి ప్రస్తావనకు అనుకూలంగా తమ వాదనలు వినిపించారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు ‘నో’ చెప్పడానికి అధికారాలు వున్నాయన్నారు. తమ పరిధుల్లో వర్తించగల చట్టాలను మాత్రమే చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను 286, 287 అధికరణలు పరిమితం చేస్తున్నాయని అన్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే పార్లమెంట్‌ ద్వారా కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. అయినా నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు వ్యాఖ్యలను ఉదహరించారు. ఆలస్యమవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులను నివారించవ్చని ఆయన వాదించారు. ఛత్తీస్‌గడ్‌ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది మహేష్‌ జెత్మలానీ మాట్లాడుతూ, బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అట్టిపెట్టారంటేనే ఆ బిల్లును తిరస్కరిస్తున్నారని అర్ధమని అన్నారు.
ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ల తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ మాట్లాడుతూ, రాష్ట్రపతి,గవర్నర్లకు సంపూర్ణంగా పనిచేసే వ్యవహారాల్లో స్వయం ప్రతిపత్తి వుండాలన్నారు. వారికి విస్తృతంగా విచక్షణా అధికారాలు వుంటాయన్నారు. రాజ్యాంగబద్ధత అనేది న్యాయమూర్తులు కోరుకునే విధంగా వుండకూడదని వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకునే అత్యున్నత శిఖరంపై గవర్నర్‌ కూర్చుని వుంటారని అందువల్ల గవర్నర్లకు కాల పరిమితులు విధించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వ్యాఖ్యానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad