నవతెలంగాణ-హైదరాబాద్: పదేండ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్.. ఎమ్మెల్సీ కవితపై వేటు వేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారుస్థాయికి చేరుకుంది. కేసీఆర్ నిర్ణయాన్ని ఆ పార్టీలు నాయకులు స్వాగతిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకొని, ఆమె దిష్టబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో ఆమె చిత్రాలను తొలగించి వేస్తున్నారు. ఈక్రమంలో కవిత నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇటీవల పార్టీ అంతర్గత విషయాలపై తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తండ్రి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కీలక విషయాలను ఆ లేఖలో ఆమె ప్రస్తావించింది.
అయితే అదృశ వ్యక్తులు ఆ లేఖను బయటికి లీక్ చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది. దీంతో అప్పట్నుంచి కేసీఆర్ కు, కవితకు మధ్య దూరం పెరుగుతోంది. అధికార పక్షానికి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన..బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా బీసీ జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్ పెంచాలని కవిత పోరుబాట చేపట్టి నిరసన తెలిపిన గులాబీ దండు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తన అనుచర గళంతో ఓ పార్టీ స్థాపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో ఆమె సొంత పార్టీ ప్రకటిస్తే ఏపీ తరహాలో అన్న చెల్లెలు వైఎస్ జగన్, షర్మిలా తరహాలో తెలంగాణలో కూడా తండ్రి కూతుర్ల మధ్య రాజకీయ పోరు నడవనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు ఎన్ని అంచనాలు వేసినా రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ కవిత తీసుకునే నిర్ణయంతోనే ఈ తరహా ఊహగానాలకు తెరపడనున్నాయి.