Monday, May 5, 2025
Homeప్రధాన వార్తలుడిగ్రీలో ఈ ఏడాది ఏఐ కోర్సు లేనట్టే

డిగ్రీలో ఈ ఏడాది ఏఐ కోర్సు లేనట్టే

- Advertisement -

– యూనివర్సిటీ సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రత్యేక సమావేశం
– కరికులం ఎలా ఉండాలనే చర్చకే పరిమితం
– విధి విధానాలు రూపొందించని ఉన్నత విద్యా మండలి
– ఏఐ కోర్సు పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌ జాడలేదు
– డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌
– సాధారణ కోర్సుల పట్ల విద్యార్థుల్లో అనాసక్తి
– ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి పెరగనున్న డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రపంచమంతా కృత్రిమ మేథస్సు (ఏఐ) గురించే చర్చించుకుంటోంది. భవిష్యత్‌ అంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌దే అంటున్నారు. అయితే కృత్రిమ మేథస్సును అందిపుచ్చుకునే నైపుణ్యం కావాలి. అందు కోసం డిగ్రీలోని సాధారణ సబ్జెక్ట్‌లతో పాటు ఏఐ కోర్సును కూడా ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తెలంగాణను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని పలు వేదికల్లో ప్రకటించారు. ఎందుకంటే ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాదు విద్యా రంగంలోనూ ఇప్పటికే ఏఐ పాత్ర మొదలైంది. ఇక సమీప భవిష్యత్‌ అంతా ఏఐదేనని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే డిగ్రీలో ఏఐ కోర్సు ప్రవేశపెట్టాల్సిన అవశ్యకత ఏర్పడింది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆ దిశగా అడుగులు వేసినట్టే వేసి వెనకబడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో ఏఐ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు. యూనివర్సిటీ సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కొత్త కోర్సులతో కరికులం ఎలా ఉండాలనేది మాత్రమే చర్చించి వదిలేశారు. దాంతో ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో ఏఐ కోర్సు లేనట్లేనన్నది స్పష్టమవుతోంది. సాధారణ సబ్జెక్టులతో పాటు ఏఐ కోర్సును ప్రారంభించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.
పెరిగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆవశ్యకత
రాబోయే కాలంలో ఎఐ నిపుణుల అవసరం ఎంతో ఉందనేది స్పష్టమవుతోంది. వ్యవస్థలను డిజైన్‌ చేసి, నిర్మించే, ఆప్టిమైజ్‌ చేసే శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌ను తయారు చేసుకోవడం ద్వారానే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకోగలుగుతాం. కృత్రిక మేథస్సు అనేది నిర్ణయం తీసుకోవడం, సమస్య పరిష్కారం, అబ్యాసం వంటి పనులను నిర్వహించడానికి మానవ మేథస్సును అనుకరించే యంత్రాలను కలిగి ఉంటుంది. సారాంశంలో సామర్ధ్యంలో భారీ డేటాసెట్‌లను ప్రాసెస్‌ చేసి విశ్లేషించే సంక్లిష్టమైన అల్గరిథమ్‌ల వ్యవస్థలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఏఐ పాత్ర ప్రారంభమైంది. వైద్య రంగంలో ఎంతో నైపుణ్యం కలిగిన వైద్యలు చేయలేని ఆపరేషన్లు, వ్యాధుల నిర్దారణ వంటి ప్రక్రియలన్నీ ఏఐ చేసి చూపిస్తుందని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఏఐతో పాటు మెషన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్‌ వంటి ప్రాధాన్యత కలిగిన కోర్సులను అభ్యసించడం పెరగాలి. ఇప్పటికే బీటెక్‌లో సీఈసీ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థులకు మాత్రమే ఏఐ వైపు వెల్లగలుగుతున్నారు. డిగ్రీలో సాధారణ కోర్సులు తప్ప ఏఐ లాంటి అత్యాధునిక సబ్జెక్ట్స్‌ బోధించేందుకు అవసరమైన ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం, కోర్సుల్ని ప్రారంభించడం కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకోవాలి. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఏఐ పాత్ర పెరిగితే ప్రస్తుతం అభ్యసిస్తున్న సాధారణ సబ్జెక్టుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 2900 జూనియర్‌ కళాశాలలు, 1000 వరకు ప్రభుత్వ, ప్రయివేట్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. పట్టణాల్లో ఒక్కో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెయ్యి నుంచి రెండు మూడు వేల మంది వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. డిగ్రీలో ఏఐ కోర్సు అందుబాటులోకి వస్తే లక్షలాది మంది విద్యార్థులు తమకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఆశపడుతున్నారు.
డిగ్రీలో ఏఐ కోర్సుల ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి కసరత్తు
2025-26 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ఏఐ కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని గతంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అందు కోసం డిగ్రీ విద్యా విధానంలో నూతన కోర్సుల ఆవశ్యకతను గుర్తించి ఈ విద్యా సంవత్సరం నుండే కృత్రిమ మేథస్సు(ఏఐ) కోర్సును ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా వెల్లడించింది. ఏఐ విద్యను బీఏ, బీకాం కోర్సుల్లో ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఏఐలో మెషన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనాలసిస్‌ వంటి కోర్సును చదివే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని చెప్పింది. మొదటి సంవత్సరంలో కృత్రిమ మేథస్సు(ఎఐ), రెండో సంవత్సరంలో మెషన్‌ లెర్నింగ్‌, మూడో సంవత్సరంలో సైబర్‌ సెక్యూరిటీ ప్రవేశ పెట్టాలని బావించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న ఆయా విశ్వవిద్యాలయాల్లోని వివిధ విభాగాల సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించింది. కృత్రిమ మేథ, అడ్వాన్స్‌ కోర్సులను అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టాలని చర్చించింది. కొత్త కోర్సులతో కూడిన కరికులం ఎలా ఉండాలనే విషయాలపై నిపుణులతో చర్చించి సూచనలు స్వీకరించినట్టు తెలుస్తోంది.

డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థుల్లో నిరాశ
డిగ్రీ చదవులంటే బీఏ, బీకాం తప్ప అడ్వాన్స్‌డ్‌ కోర్సులేవీ లేవనే భావన విద్యార్థుల్లో బలపడింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్‌కు దారులు వేయాల్సిన ఉన్నతి విద్యా మండలి పాత పద్దతిలోనే ఆలోచిస్తుందన్న వాదన ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో కృత్రిమ మేథస్సు(ఎఐ) కొత్త కోర్సును ప్రవేశపెడతామని చెప్పి ఆచరణలో మాత్రం అశ్రద్ధ చేసిందనే చెప్పాలి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కసరత్తు చేసిన విద్యా మండలి ఆ తర్వాత పట్టించుకున్నట్టు లేదు. కొత్త కోర్సుల్ని ప్రవేశ పెట్టాలంటే సబ్జెక్ట్‌, అకాడమిక్‌ నిపుణులతో చర్చించాలి. లోతైన అధ్యయనం చేయాలి. కొత్త కోర్సుల అవసరాన్ని గుర్తించాలి. ఆ మేరకు విద్యార్థులకు అవగహన కల్పించాలి. కోర్సుల్ని బోధించేందుకు అవసరమైన సబ్జెక్ట్‌ బోధకుల్ని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
అందు కోసం ఫ్యాకల్టీని నియమించాలి. ముందస్తుగా పాఠ్యపుస్తకాల తయారీ, ముద్రణ, మెటీరియల్స్‌ సిద్దం చేయడం వంటి పనులేవీ జరగనందున ఈ విద్యా సంవత్సరంలో ఏఐ కొత్త కోర్సులు అందుబాటులో ఉండవని పలువురు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్‌ తెలిపారు. దాంతో డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బీఏ, బీకాం లాంటి కోర్సుల్లో నేర్చుకునే సబ్జెక్ట్‌లు మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు పొందేలా లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు ఎఐ కోర్సు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో పాత సబ్జెక్టుల్ని బోధించేందుకే సరిపడా లెక్చరర్లు లేరు.
ఏఐ కోర్సు అవసరం: రాజేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
డిగ్రీ స్థాయిలో సాధారణ కోర్సులతో పాటు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఏఐ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐ కోర్సును ప్రవేశపె డుతున్నట్టు ఉన్నతి విద్యా మండలి చైర్మెన్‌ బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. రెండో రోజులైనా ఏ కళాశాలలో ఏ రకమైన కోర్సులు ఉన్నాయనేది తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏఐ కోర్సుల్ని ప్రవేశపెట్టేందకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -