- తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2026 నూతన సంవత్సర సందర్భంగా భావోద్వేగభరితమైన ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు, తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో సాగిన పోరాటాన్ని కేటీఆర్ స్మరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
చివరగా, 2028లో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేస్తూ, చిన్నచిన్న ఎదురుదెబ్బలను పెద్దగా పట్టించుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



