Thursday, May 15, 2025
Homeజాతీయంకేరళలో అభివృద్ధికి ప్రచారం జరగడం లేదు

కేరళలో అభివృద్ధికి ప్రచారం జరగడం లేదు

- Advertisement -

– ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ నాలుగో వార్షికోత్సవంలో సీఎం విజయన్‌
కోజికోడ్‌: కేరళలో జరగుతున్న అభివృద్ధి, ఆర్థిక స్థితి గురించి సరైన ప్రచారం జరగడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. మరికొంత మంది కేరళ ఆర్థిక స్థితి గురించి తప్పుడు సమాచారం, పాక్షిక సమాచారాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తున్నారని విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం నాల్గో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయన్‌ ప్రసంగించారు. కోజికోడ్‌ జిల్లాలోని చెరువన్నూర్‌లోని కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం గురించి పూర్తి వాస్తవ ప్రచారం చేయాల్సినవారు తమ సొంత స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆ పనిని చేయడం లేదని విజయన్‌ విమర్శించారు. ‘కేరళలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడం లేదని కూడా చెబుతున్నారు. ఇది నిజంగా తప్పు’ అని చెప్పారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం తన సొంత ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా అభివృద్ధి పనులను చేపట్టగలిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.47,000 కోట్ల నుంచి రూ. 81,000 కోట్లకు పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర మొత్తం ఆదాయం కూడా మూడేండ్లలో రూ.55,000 నుండి రూ. 1,04,000 కోట్లకు పెరిగిందని విజయన్‌ పేర్కొన్నారు.రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేసేవారికి రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆసక్తి లేదని విమర్శించారు. ”అటువంటి అభివృద్ధి వ్యతిరేక మనస్తత్వం ఉన్న వ్యక్తులను తిప్పికొట్టాలి” అని విజయన్‌ పిలుపునిచ్చారు.
అలాగే, రాష్ట్ర రుణ భారం చాలా ఎక్కువగా ఉందనే మరో ప్రచారం జరుగుతోందని, అయితే ఒక రాష్ట్రం యొక్క రుణాన్ని దేశీయ ఉత్పత్తితో పోల్చిన తర్వాతే లెక్కించాలని తెలిపారు. దేశీయ ఉత్పత్తికి, ప్రభుత్వ రుణానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంటే, అది ఆందోళన కలిగించే విషయమని కానీ, కేరళ విషయంలో, ఈ వ్యత్యాసం సంవత్సరాలుగా తగ్గుతుందని చెప్పారు.
అలాగే, రాష్ట్రంలో ప్రయివేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, తీవ్ర పేదరికాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి విజయన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన 500 మంది వ్యక్తులతో ముఖ్యమంత్రి సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రజా పనుల మంత్రి పీఏ మొహమ్మద్‌ రియాజ్‌, కోజికోడ్‌ మేయర్‌ బీనా ఫిలిప్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -