నవతెలంగాణ-హైదరాబాద్: చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందన్న అమెరికా ప్రకటనపై రష్యా ఘాటుగా స్పందించింది. ఆ వార్తలను విశ్వసించేందుకు తగిన ఆధారం లేదని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ తన వైఖరి మార్చుకుందని విశ్వసించేందుకు ”ఎటువంటి ఆధారం” లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం తెలిపారు. ఈ కొనుగోళ్లు రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.
రష్యా ముడి చమురు దిగుమతిని నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర దేశాల నుండి ఆదేశాలను జారీ చేసే హక్కును లాక్కున్న అధ్యక్షుడు ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోల వ్యాఖ్యల్లో కొత్తదనమేమీ లేదని అన్నారు. ఉక్రెయిన్, యూరోపియన్ మిత్రదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వారు శాంతి పరిష్కారాన్ని కోరుకోవడం లేదని అన్నారు. అయితే రష్యా ముడి చమురు సేకరణను నిలిపివేయడానికి కట్టుబడి ఉన్నామని వాషింగ్టన్ చేసిన వాదనను భారత్ ఇప్పటికీ ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.



