- Advertisement -
- చెంగిచెర్లలో ఘటన.. మృతదేహం తరలించాలని యజమాని బలవంతం
నవతెలంగాణ-బోడుప్పల్: చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ (రోడ్ నెం.4)లో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికులను కలచివేసింది. బూమేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో గత కొన్ని సంవత్సరాలుగా అద్దె ఇల్లు (ఇండిపెండెంట్ హౌస్)లో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో ఆయన తల్లి ఈ రోజు ఉదయం మృతి చెందారు.కానీ ఈ విషాద సమయంలో ఇల్లు యజమాని రాజేష్ మానవత్వాన్ని పక్కన పెట్టి, మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచుకోవద్దని, సంబంధించిన కార్యక్రమాలు (దహన సంస్కార ఏర్పాట్లు) ఇంటి పరిసరాలలో చేయకూడదని గట్టిగా చెప్పినట్లు సమాచారం. దాంతో పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబం మరింత ఇబ్బందులకు గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల స్పందన: ప్రజలు, పొరుగువారు ఈ ఘటనను ఖండిస్తూ, “శవానికి కూడా ఇల్లు చోటు ఇవ్వకపోవడం ఘోరం” అని మండిపడుతున్నారు. కుటుంబం మృతదేహాన్ని ఇంటికి తెచ్చుకుని ఆచారాలు చేయాలని ప్రయత్నించగా, యజమాని తీవ్రంగా ఆపివేయడమే కాక వెంటనే తరలించాలని ఒత్తిడి తెచ్చాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సహకారం కోసం పిలుపు: ఈ సంఘటనపై పోలీసులు, ప్రజాప్రతినిధులు, మానవహక్కుల సంఘాలు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. మానవత విలువలను రక్షించే దిశలో అధికారుల తక్షణ చర్య అవసరమని వారు ఆవశ్యకతను వ్యక్తం చేశారు.
- Advertisement -