Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంమావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు

- Advertisement -

– తుపాకీ వీడాలి
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటే
– కేంద్రం కుల గణన నిర్ణయం చారిత్రాత్మకం
– రాష్ట్రంలో బీసీలను తగ్గించి చూపించారు
– కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ నివేదికలిచ్చినా చర్యలెందుకు తీసుకోలేదు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌
నవతెలంగాణ – కరీంనగర్‌

మావోయిస్టులతో చర్చలకు తావే లేదని, నిషేధిత సంస్థతో సంభాషణ అనే ఆలోచన దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తుపాకీతో అమాయకులను, గిరిజనులను కాల్చి చంపుతున్నవాళ్లను సామాజిక కోణంతో చూడాలంటారా.. ఇది ఎలాంటి నైతికత అని అన్నారు. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్‌ అని, ఇప్పుడు అదే పార్టీ నేతలు చర్చలు జరపాలని మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. అసలు మావోయిస్టులపై నిషేధాన్ని ఎత్తివేయగల ధైర్యం కాంగ్రెస్‌ సర్కార్‌కు ఉందా అని ప్రశ్నించారు. గతంలో మావోయిస్టులు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నాయకుల్ని సహా ఎన్నో హత్యలు చేశారని తెలిపారు. గిరిజనుల్ని, పోలీసులను బాంబులతో, తుపాకులతో చంపినవాళ్లతో ప్రభుత్వం చర్చలు జరపాలనుకోవడమే మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రోహింగ్యాల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అలసత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌పోర్టు, వీసా లేని విదేశీయులను గుర్తించి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందని, ఇది దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చన్నారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ నివేదిక వచ్చిందని, అయినా చర్యలు తీసుకోని ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతికి కాంగ్రెస్‌ అండగా మారిందని, రెండు పార్టీలు కలసి మావోయిస్టులతో చర్చలు అంటూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలో ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన కులగణన చారిత్రాత్మకమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించారన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవహారాల్లో విఫలమైందని, ఆరు గ్యారంటీల అమలుపై డమ్మీ డ్రామాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, వారు తుపాకీ వదిలి పోలీసులకు లొంగిపోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాసాల రమేష్‌, మాజీ మేయర్‌ సునీల్‌ రావు, కొత్తపల్లి మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -