Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసాయం కోసం వస్తే చంపేస్తున్నారు

సాయం కోసం వస్తే చంపేస్తున్నారు

- Advertisement -

– ఆహార పంపిణీ కేంద్రాలపై విచక్షణారహితంగా కాల్పులు
– ఇజ్రాయిల్‌పై ఐరాస ఆగ్రహం
– గాజాలో తీవ్రమైన ఇంధన కొరత
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాష్టీకాలు ఆగడం లేదు. ఆకలి మంటలతో సహాయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న ప్రజలపై కనికరం కూడా లేకుండా దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌ దళాలు వందలాది మంది అన్నార్తులను పొట్టనపెట్టుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి మండిపడింది. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుం టున్న ఐరాస సిబ్బంది కూడా ఇజ్రాయిల్‌ దాడులకు బలవుతున్నారు. ఒక్క 2024లోనే 126 మందిని కోల్పోయామని ఐరాస తెలిపింది. సహాయ సిబ్బంది ఉంటున్న ప్రాంతం పక్కనే ఐదు దాడులు జరిగాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టీఫెన్‌ దుజారిక్‌ చెప్పారు.
గాజా :
గత 24 గంటల కాలంలో ఇజ్రాయిల్‌ దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, వీరిలో 26 మంది సహాయ సిబ్బంది ఉన్నారని గాజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో 180 మంది గాయపడ్డారని వివరించాయి. గాజాలో రేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారిపై శుక్రవారం జరిగిన దాడిలో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఆరు వారాల్లో ఈ విధంగా చనిపోయిన వారి సంఖ్య 800 దాటిందని ఐరాస వివరించింది. కాగా తాజాగా దక్షిణ గాజాలోని రఫాలో అమెరికా, ఇజ్రాయిల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక ఆహార పంపిణీ కేంద్రం వద్ద వేచివున్న ప్రజలపై ఇజ్రాయిల్‌ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 30 మంది చనిపోయారు. 130 మంది గాయపడ్డారు. ఘటనా స్థలం వద్ద అనేక మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆహార పదార్థాల కోసం రఫా కేంద్రానికి చేరుకునేందుకు అనేక కుటుంబాలు ఉత్తర ప్రాంతం నుంచి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నా మృత్యువు నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
గాజాలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరిందని, దీంతో 21 లక్షల మందికి అత్యవసర సేవలు లభించకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఐరాస హెచ్చరించింది. అసలే ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఇంధన కొరత శరాఘాతంగా మారిందని తెలిపింది. ఇదిలావుండగా గత 48 గంటల్లో గాజాలోని ‘ఉగ్రవాద’ లక్ష్యాలపై 250 సార్లు దాడి చేశానని ఇజ్రాయిల్‌ చెప్పింది. భద్రతా సంబంధమైన ఆంక్షలు విధించిన దృష్ట్యా సముద్రంలోకి వెళ్లి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని గాజా పౌరులను హెచ్చరించింది. మరోవైపు గాజా నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించడంతో ఆరున్నర లక్షల మంది చిన్నారులు సహ భారీ సంఖ్యలో ప్రజలు తీవ్రమైన కరువుతో విలవిల్లాడుతున్నారని ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లో అనేక మంది ఆహారం, అత్యవసర మందుల కొరతతో మృతి చెందారని వారు తెలిపారు. కాగా అమెరికా ఆంక్షలు తనను ఆపలేవని ఐరాస ప్రత్యేక పాత్రికేయురాలు ఫ్రాన్సెస్కా అల్బనేస్‌ స్పష్టం చేశారు. ప్రజలందరూ సంఘటితమై అమెరికా దుశ్చర్యలను ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -