Thursday, May 22, 2025
Homeజాతీయంనా గొంతు నొక్కేందుకే భయపెడుతున్నారు

నా గొంతు నొక్కేందుకే భయపెడుతున్నారు

- Advertisement -

– విద్యావేత్త నిటాషా కౌల్‌
న్యూఢిల్లీ:
భారతీయ రిజిస్ట్రేషన్‌ కలిగిన తన ఓవర్‌సీస్‌ పౌరసత్వాన్ని (ఓసీఐ) రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన విద్యావేత్త, రచయిత నిటాషా కౌల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతు నొక్కే ఉద్దేశంతో ప్రభుత్వం భయపెడుతోందని విమర్శించారు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ మినిస్టర్‌లో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కౌల్‌కు ఆదివారం కేంద్రం నోటీసులు అందజేసింది. రచనలు, ప్రసంగాలు, పాత్రికేయ విధుల ద్వారా వివిధ అంతర్జాతీయ వేదికలు, సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఓసీఐని రద్దు చేశామని ప్రభుత్వం ఆ నోటీసులో తెలియజేసింది.
ఇలా జరగడానికి కారణాలేమిటో తెలుసుకోలేకపోతున్నానని కౌల్‌ చెప్పారు. పహల్గాం దాడి జరిగిన రెండు రోజుల తర్వాత కాశ్మీరీ పండిట్‌ అయిన కౌల్‌ ‘ది కాన్వర్‌సేషన్‌’ అనే పత్రికకు వ్యాసం రాశారు. ప్రాంతీయ సంక్లిష్ట రాజకీయాలను ఆమె అందులో విశ్లేషించారు. అల్‌ జజీరా ఛానల్‌కు కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే దానిని యూట్యూబ్‌ ఇండియా నుండి తొలగించారు. ఇంతకీ ఆమె ఆ వ్యాసంలో ఏం రాశారంటే… ‘ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు కావాల్సి ఉంది. ఎలాంటి భద్రతా లోపాలు జరిగాయి? వాటికి బాధ్యులెవరు? జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి కారణమైన విధానపరమైన వైఫల్యాలేమిటి? ప్రభుత్వంలో ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఈ దాడి నుండి మనం తీసుకోగల పాఠాలు ఏమిటి?.
ప్రస్తుతం హర్యానా పోలీసుల అదుపులో ఉన్న అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహమూదాబాద్‌ ఉదంతాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైనది కాదని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై నిటాషా కౌల్‌ తరచూ వ్యాసాలు రాస్తుంటారు. 2019లో అమెరికాకు చెందిన విదేశీ వ్యవహారాల సభా కమిటీ ముందు ఆమె సాక్ష్యం కూడా ఇచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దుతో రాష్ట్రంలో మానవ హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతోందో అక్కడ వివరించారు. ప్రభుత్వంతో తలపడడం కౌల్‌కు ఇదేమీ మొదటిసారి కాదు. గత సంవత్సరం బెంగళూరులో రాజ్యాంగంపై కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కాకుండా ఆమెను అడ్డుకున్నారు. గత కొద్ది వారాలుగా ఆమె మీడియా సెన్సార్‌షిప్పుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమాలలో కౌల్‌ను కించపరుస్తూ అనేక పోస్టులు వస్తున్నాయి. ఆమెను ‘జిహాదీ వధువు’గా అభివర్ణిస్తూ పాక్‌ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తున్నారు.
బెంగళూరు సదస్సుకు హాజరవకుండా నిరోధించే వరకూ కౌల్‌ తరచుగా భారత్‌లో పర్యటించే వారు. గోరఖ్‌పూర్‌లో జన్మించి, న్యూఢిల్లీలో విద్యాభ్యాసం చేసిన కౌల్‌1997లో బ్రిటన్‌కు వలస పోయారు. ఆమె తల్లి ఇప్పటికీ భారత్‌లోనే నివసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -