– లేబర్ కోడ్‌లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
– పార్టీగా వ్యతిరేకం.. ప్రభుత్వంగా అనుకూలం
– గుట్టుగా కసరత్తు చేస్తున్న కార్మికశాఖ
– అమలు కోసం ఒత్తిడి పెంచుతున్న యాజమాన్యాలు
– ‘కోడ్’లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక సంఘాల డిమాండ్
– డైలమాలో సీఎం రేవంత్‌రెడ్డి
లేబర్ కోడ్‌లు…బీజేపీ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రతిపక్షపార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మోడీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నది. పార్లమెంటులోనూ ‘కోడ్’లకు వ్యతిరేకంగా గళం విప్పి, తాము భారతదేశ కార్మికవర్గం పక్షాన ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసింది. ఆపార్టీ అనుబంధ కార్మిక సంఘంగా ఉన్న ఐఎన్‌టీయూసీ కూడా 29 కార్మిక చట్టాల రద్దు, లేబర్‌కోడ్‌ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. ‘కోడ్’ల వల్ల కార్మికులకు జరిగే నష్టాలను అనేక వేదికలపై కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీలు ఏకరువుపెట్టాయి. కానీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం భిన్నమైన వైఖరిని ప్రకటిస్తుండటం గమనార్హం! రాష్ట్రంలో లేబర్‌కోడ్‌లను కాంగ్రెస్‌పార్టీగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వంలో మాత్రం వాటి అమలుకోసం కసరత్తును ముమ్మరం చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీన్ని పసిగట్టిన కార్మికసంఘాలు లేబర్‌కోడ్‌లను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఎస్ వెంకన్న
భారతదేశ కార్మివర్గం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసేసింది. వాటిస్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చింది. బీజేపీ, దానిమాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ సహజంగానే పెట్టుబడిదారీ వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంటాయి. దేశంలో అదానీ, అంబానీల వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ కోసం ప్రధాని నరేంద్రమోడీ పడుతు న్న తాపత్రయం ప్రత్యక్షంగా కండ్లముందు కనిపిస్తూనే ఉంది. తాజాగా అమెరికాతో అంటకా గేందుకు ఆ దేశంతో అడ్డగోలు వాణిజ్య ఒప్పందాలకు సై అన్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల వల్ల దేశ ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసినా, కేంద్రం నిద్ర నటిస్తూ కార్మిక, కర్షక, సామాన్య ప్రజానీకాన్ని మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది. సహజంగా బూర్జువాపార్టీల విధానాలన్నీ పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంటాయి. అయితే మోడీ ప్రభుత్వం లేబర్‌కో డ్‌లను అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించగానే కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటులో బీజేపీ విధానాలపై దుమ్మెత్తి పోసింది. కార్మికులకు ద్రోహం చేస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలే చేసింది. ఆపార్టీ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లి ఖార్జున ఖర్గే స్వయంగా ‘కోడ్’లకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఎండగట్టారు. తాము కార్మికవర్గం పక్షానే ఉంటామనే విశ్వాసాన్ని కలిగించే ప్రయ త్నం చేశారు. ఇక్కడి వరకు సీన్ బానే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ‘లేబర్‌కోడ్’ల పై పార్టీ పరంగా కాంగ్రెస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఈ ‘కోడ్’ల అమలు కోసం కార్మిక శాఖ ద్వారా కసరత్తును ముమ్మరంచేస్తున్నారు. ‘కోడ్’ల అమలు కోసం రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు రేవంత్‌రెడ్డి సర్కారుపై తీవ్ర వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికశాఖ మంత్రిగా ఉన్న గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా స్వతహాగా పెట్టుబడి దారుడిగా అనేక వ్యాపార, వాణిజ్య సంస్థల్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యం లో లేబర్‌కోడ్‌లు అమల్లోకి వస్తే, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంద నే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలంటే, ‘కోడ్’ల అమలు అవసరమే అనే విషయాన్ని తమ ప్రయివేటు సంభాషణల్లో చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుం ది. ఫలితంగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు లేబర్‌కోడ్‌ల అమలు కోసం విధివిధానాల ఖరారు కోసం కసరత్తును ముమ్మరం చేస్తున్నారని కార్మికసంఘాలు చెప్తున్నాయి.
అమలుకు గుట్టుగా సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు చాపకింది నీరులా పావులు కదుపుతోంది. కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర పరిస్థితికి తగినట్టుగా విధి విధానాలను గుట్టుగా రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు అమలవుతున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి, పది గంటల పని విధానానికి ప్రభుత్వం జీవో 282ను గత ఏడాది జులై 5న విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం వారానికి 48గంటల పని పరిమితి ఉన్నప్పటికీ రోజువారీ పని సమయం పదిగంటలు శ్రమించాల్సిందే. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లేబర్ కోడ్‌ల సవరణ పేరుతో కార్మికులపై శ్రమభారాన్ని మోపుతున్నాయి. ఆ కోవలోనే మన రాష్ట్రంలోనూ పది గంటల పని విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు.
యాజమాన్యాల ఒత్తిడే కారణం
లేబర్‌కోడ్‌ల అమలుకోసం యాజమాన్యాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. కార్మికశాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి స్వయంగా దీనికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయనే స్వయంగా కార్మికశాఖ రూపొందిస్తున్న విధివిధానాలపై అంతర్గత సమీక్షలు చేస్తున్నారని సమాచారం. తొలుత ముసాయిదా రూపొందించి, దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, కార్మికులు, కార్మిక సంఘాలు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకోవాలా? లేక నేరుగా విధివిధానాలు ఖరారు చేసి అసెంబ్లీలో చట్ట సవరణకు ప్రతిపాదించాలా? అనే అంశంపై మంత్రి పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నట్టు తెలిసింది.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి – కార్మిక సంఘాల డిమాండ్
రాష్ట్రంలో లేబర్ కోడ్‌లు అమలు చేయబోమని స్పష్టంచేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని ఆయా సంఘాల నేతలు చెప్తున్నారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే ధోరణి సరికాదని హితవు పలుకుతున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేయాలనీ, ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటే, కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సిగాచీ వంటి పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, కార్మికశాఖ నిర్లక్ష్యం వంటి అనేక అంశాలను ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల నాటికి కార్మికవర్గాన్ని చైతన్యం చేసి, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా ప్రత్యక్ష కార్యాచరణకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
అమలు చేస్తే ఉద్యమమే పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు అమలు చేయబోమంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దీనికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాలి. లేదంటే కార్మిక ద్రోహులుగా మిగిలిపోతారు. కార్మిక శాఖలో ఇప్పటికే కోడ్‌ల అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిని తక్షణమే నిలుపుదల చేయాలి. కార్మిక శాఖ యజమానుల శాఖగా కాకుండా, కార్మికుల పక్షాన నిలిచే శాఖగా నిలదొక్కుకోవాలి. అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుంది. లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా ఐక్య కార్మికోద్యమాలు తప్పవు. అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలి.
కార్మిక హక్కుల హననం
లేబర్‌కోడ్‌ల అమలు వల్ల కార్మికుల హక్కులకు భంగం కలిగి, శ్రమదోపిడీ పెరుగుతుందనే విషయాన్ని ప్రతిపక్షపార్టీలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 12న జరిగిన సార్వత్రిక సమ్మెలో రాజకీయపార్టీలు, కార్మికసంఘాలు ఎలుగెత్తి చాటాయి. ఆ సమ్మెకు కాంగ్రెస్‌పార్టీ మద్దతు ప్రకటించింది. ఐఎన్‌టీయూసీ సమ్మెలో భాగస్వామ్యమైంది. హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద జరిగిన నిరసన ర్యాలీ, కార్మికుల బహిరంగ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ స్వయంగా పాల్గొన్నారు. లేబర్‌కోడ్‌ల వల్ల కార్మికులకు, సంఘాలకు జరిగే నష్టాలను ఏకరువు పెట్టారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శనా స్త్రాలు సంధించారు. రాష్ట్రంలో తమపార్టీనే అధికారంలో ఉన్నందున నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయబోమని స్పష్టంగా ప్రకటించారు. ఆ మేరకు చట్టసభల్లో తీర్మానం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.



