నవతెలంగాణ-హైదరాబాద్:పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అసన్‌సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధితురాలు, దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శుక్రవారం రాత్రి స్నేహితుడితో డిన్నర్‌కు వెళ్లగా, బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిని వెంబడించారు. స్నేహితుడిని బెదిరించి పంపించి, యువతిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే, బాధితురాలి ఫోన్‌కు తమ మొబైల్ నుంచి కాల్ చేశారు. ఈ ఫోన్ నంబర్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొదట ఆ నంబర్‌కు సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, మిగతా నలుగురి వివరాలు తెలిశాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతం దట్టమైన అడవి కావడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. దీంతో పోలీసులు బైక్‌లు, డ్రోన్ల సహాయంతో మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

                                    

