నవతెలంగాణ-హైదరాబాద్: ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్-అమెరికా దేశాలు కలిసి ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం మృతితోపాటు అనేక మంది కీలక వ్యక్తులు మృతి చెందారు. 13 రోజుల యుద్ధంలో మూడు దేశాలు క్షిపణులతో పరస్పర దాడులతో మోత మోగిస్తున్నాయి. అదే విధంగా గల్ఫ్ దేశాలపై కూడా విపరీతంగా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే చమురు సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో మూడు దేశాలు యుద్ధానికి ముగింపు పలకాలని ఆయా దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచిస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్(Masoud Pezeshkian) దీని గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.
అమెరికా కూటమితో ఎటువంటి ఒప్పందం జరిగినా.. ఇరాన్ సహజ హక్కులను గుర్తించాలని పెజెష్కియాన్ అన్నారు. రష్యా, పాకిస్థాన్ నేతలతో ఈ అంశం గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే కొన్ని అంశాలు కీలకమైనవని ఆయన అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ముగియాలంటే మూడు అంశాలు ముఖ్యమైనవని పెజెష్కియాన్ తెలిపారు. ఇరాన్ హక్కుల్ని గుర్తించడం, నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయబోమనన్న గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.



