నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో షాక్ తగిలి ప్రమాదం జరిగింది. మరోవైపు అంబర్‌పేట్‌లో రామ్ చరణ్ అనే యువకుడు ఇదే విధంగా విగ్రహం తరలిస్తుండగా.. అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి మరువక ముందే నగరంలో మరోవిషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు విద్యుత్ షాక్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
అయితే విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో చనిపోయినట్టు ఆనవాళ్లు లేవని ఎస్‌ఈ శ్రీరామ్‌మోహన్ తెలిపారు. బండ్లగూడలోని సంఘటన స్థలిని ఆయన పరిశీలించారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో ఇద్దరు చనిపోయినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ట్రాలీపై ఉన్న వ్యక్తులు కిందపడి తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.