నవతెలంగాణ-హైదరాబాద్: 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సిబిఎస్‌ఇ తాజాగా ప్రకటించింది. త్రిభాషా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, ఆ భాషను బలవంతంగా రుద్దడానికి చేసే ప్రయత్నమేనని ఆయన మండిపడ్డారు. ఈ విధానం సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుందని, హిందీ మాట్లాడని రాష్ట్రాలను అణచివేస్తుంది. పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులపై అనవసర భారాన్ని మోపుతుందని స్టాలిన్ ఆరోపించారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని, రాష్ట్రాలవ్యాప్తంగా విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా, ‘జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) విద్యార్థులు మూడు భాషల్ని చదవాలని తెచ్చిన కొత్త పాఠ్యప్రణాళిక విధానం నిష్కపటమైన విద్యా సంస్కరణ కాదు. ఇది హిందీని బలవంతంగా రుద్దాలని ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నం. ఇది బిజెపి హిందీని మాపై బలవంతంగా రుద్దుతుంది అన్న ఆందోళనల్ని నిజం చేస్తుంది. భారతీయ భాషలను ప్రోత్సహించే ముసుగులో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం భారతదేశపు గొప్ప, వైవిధ్యభరితమైన భాషా వారసత్వాన్ని క్రమపద్ధతిలో అణచివేస్తూ, హిందీని ప్రాధాన్యతనిచ్చే కేంద్రీకరణ ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది.
మూడు భాషల సూత్రం అని పిలిచేది వాస్తవానికి హిందీ మాట్లాడని ప్రాంతాలలోకి హిందీని విస్తరించడానికి ఉద్దేశించిన ఒక రహస్య యంత్రాంగం. కేంద్ర ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక విధానం హిందీ మాట్లాడే విద్యార్థులకు నిర్మాణాత్మకంగా ప్రాధాన్యతనిస్తుంది. నిష్పక్షపాతాన్ని, సమాఖ్యవాదాన్ని, ప్రాంతీయ సమానత్వాన్ని దెబ్బతీస్తుంది’ అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో విమర్శించారు. ఇలాంటి విధానాలు భారతదేశ భాషా వైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయని స్టాలిన్ హెచ్చరించారు. విద్యార్థుల హక్కులు, ప్రాంతీయ గుర్తింపు కోసం నిలబడాలని తమిళనాడులోని ఏఐఎడిఎంకె, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు.
త్రిభాషా విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులను హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేస్తుంది. మరి హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, లేదా బెంగాలీ, మరాఠీ వంటి భాషలను కూడా తప్పనిసరిగా నేర్చుకుంటారా? దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు, ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు మధ్య నేర్చుకునే విధానంలో స్పష్టత లేదు. ఈ విధానం ఏకపక్షంగా హిందీని రుద్దడమనే వివక్షాపూరిత స్వభావాన్ని బయటపెడుతుంది. ఈ వైరుధ్యం ఆమోదయోగ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో తమిళాన్ని తప్పనిసరి భాషగా చేయడంలో విఫలమైంది. తమిళ భాషను బోధించడానికి తమిళ ఉపాధ్యాయులను నియమించడంలో విఫలమైంది. మరి ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలను ప్రోత్సహించడంపై రాష్ట్రాలకు ఉపన్యాసాలు ఇవ్వాలని చూస్తోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఇది భాషల పట్ల కేంద్రం చూపే వైఖరి నిబద్ధత కాదు.. పచ్చి కపటత్వం అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో ధ్వజమెత్తారు.
తమిళనాడు అనేక ఇతర రాష్ట్రాలు లేవనెత్తి చట్టబద్ధమైన, స్థిరమైన ప్రజాస్వామ్యయుతమైన ఆందోళనలను పక్కనపెట్టి, హిందీని రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విధానం సహకార సమాఖ్యవాద సూత్రాలకు విరుద్ధం. లక్షలాది మంది భారతీయుల భాషా గుర్తింపు అవమానించడమే అని స్టాలిన్ అన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడిఎంకె, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలు ఈ రుద్దకాన్ని అంగీకరిస్తాయా? లేక ఒక్కసారైనా మన విద్యార్థుల హక్కులు, గుర్తింపు, భవిష్యత్తు కోసం నిలబడతాయా? అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.



