Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంప్రపంచ సుందరి పోటీలకు కట్టుదిట్టమైన భద్రత

ప్రపంచ సుందరి పోటీలకు కట్టుదిట్టమైన భద్రత

- Advertisement -

– రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌
– నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోండి : డీజీపీ జితేందర్‌ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ప్రపంచ సుందరి పోటీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నామనీ, ఇందుకు రాష్ట్రంలోని పోలీసు అధికారులందరూ గట్టిగా కృషి చేయాలని డీజీపీ జితేందర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారాన్ని సాగిస్తున్నవారిపై ఉక్కుపాదాన్ని మోపాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇన్‌స్పెక్టర్లతో డీజీపీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 31 వరకు ప్రపంచ సుందరి పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్నదనీ, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయటంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన కోరారు. ఇందుకు అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ప్రతిష్టాకరమైన అవార్డులు రావటంతో ఏ మాత్రం నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించరాదని ఆయన అధికారులను హెచ్చరించారు. ప్రజాసమస్యలపై నిష్పాక్షికంగా వ్యవహరించినపుడే వారికి పోలీసులపై మరింతగా నమ్మకం ఏర్పడుతుందని ఆయన అన్నారు. పోలీసుఫ్రెండ్లీ విధానాన్ని అమలు చేయటం ద్వారా అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో ఆ వ్యవస్థ పట్ల సంపూర్ణ విశ్వాసం ఏర్పడిందనీ, ఆ పరిస్థితిని మన వద్ద కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ అన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే పోలీసు శాఖ పని తీరుపై ప్రతి ఒక్కరూ కన్నేసి ఉంచుతారనేది మరువరాదని ఆయన అన్నారు. రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల వ్యాపారులపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా వేసి ఉంచాలనీ, వారి అకృత్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్‌ పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -