– బ్రెజిల్‌పై ట్రంప్ సుంకాల వెనుక ఆంతర్యం ఉడత ఊపులకు భయపడబోమన్న లూలా
బ్రసిలియా : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారోను విచారణ నుంచి కాపాడేందుకే ఆ దేశంపై భారీగా సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. తన తండ్రిని కాపాడుకునేందుకు బోల్సొనారో కుమారుడు ఎడ్వర్డో బోల్సొనారో మార్చి నుంచి శ్వేతసౌధం చుట్టూ తిరుగుతూ అక్కడి అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. ఎడ్వర్డో బ్రెజిల్ కాంగ్రెస్ సభ్యుడు. తనను, తన తండ్రిని కటకటాల వెనక్కి నెట్టాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు భావిస్తోందని, తమను ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని ఎడ్వర్డో అమెరికా అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో బోల్సొనారోను కాపాడేందుకు ట్రంప్ రంగంలోకి దిగారు. ఆయనపై చర్యలకు స్వస్తి చెప్పేలా బ్రెజిల్‌పై ఒత్తిడి తేవాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే బ్రెజిల్ దిగుమతులపై భారీ సుంకాలు విధించి, దాన్ని తన దారికి తెచ్చుకోవాలని నిర్ణయించారు. తన తండ్రిపై జరుగుతున్న విచారణను పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ న్యాయమూర్తిపై ఆంక్షలు విధించాలని శ్వేతసౌధంలోని సీనియర్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నానని ఎడ్వర్డో స్వయంగా చెప్పారు. ఓ న్యాయమూర్తిపై ఆంక్షలు విధిస్తే 20 కోట్ల మంది బ్రెజిలియన్లకు హాని కలుగుతుందని ట్రంప్‌నకు తెలియంది కాదు. ఎవరికి ఎంత ఇబ్బంది కలిగినప్పటికీ తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆర్థిక విధ్వంసానికి పాల్పడడం, శత్రు దేశాలపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి తేవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
దౌత్య సంక్షోభం
ట్రంప్ చర్యలకు శ్వేతసౌధం మాజీ ప్రధాన వ్యూహకర్త స్టీవ్ బానన్ వత్తాసు పలుకుతున్నారు. బ్రెజిల్‌పై చర్యలను తాను ఇష్టపడుతున్నానని ఆయన తెలిపారు. బోల్సొనారోపై విచారణను నిలిపివేసి, ఆయనపై ఆరోపణలను అటకెక్కిస్తే సుంకాల సంక్షోభం నుంచి బ్రెజిల్ సులభంగా బయటపడుతుందని చెప్పారు. ట్రంప్ చర్యను ఆయన సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. ఏదేమైనా ట్రంప్ నిర్ణయం ఇప్పుడు పశ్చిమార్థగోళంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాల మధ్య అతి పెద్ద దౌత్య సంక్షోభాన్ని సృష్టించింది. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా మరోసారి పోటీకి దిగబోతున్నారు. ఇదే అదనుగా తన సుంకాల నిర్ణయంతో లూలాకు సమస్యలు సృష్టించాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఏం జరిగింది?
2022 ఎన్నికల్లో లూలా చేతిలో ఓటమి పాలైన బోల్సొనారో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భారీ కుట్రకు పాల్పడ్డారు. ఫలితాన్ని తారుమారు చేసి, న్యాయస్థానాలను రద్దు చేసి, సైన్యానికి అధికారాలు కట్టబెట్టాలని ఆయన పథకం పన్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. బ్రెజిల్ ఎన్నికల వ్యవస్థలపై బోల్సొనారో నిరాధారమైన ఆరోపణలు చేశారని న్యాయస్థానం రూలింగ్ ఇచ్చింది. 2030 వరకూ ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.
ప్రతీకార సుంకాలపై పరిశీలన
అయితే ట్రంప్ ఉడత ఊపులకు లూలా ఏ మాత్రం చలించడం లేదు. మాజీ అధ్యక్షుడిపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ‘బ్రెజిల్ స్వతంత్ర సంస్థలతో కూడిన సార్వభౌమత్వ దేశం. ఇలాంటి బెదిరింపులకు లొంగదు’ అని చెప్పారు. అమెరికా వాణిజ్య విధానాలపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో లూలా ధ్వజమెత్తారు. దీంతో శివాలెత్తిపోయిన ట్రంప్ బ్రిక్స్‌తో జత కట్టే ఏ దేశం పైన అయినా అదనంగా పది శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. బోల్సొనారో విషయంలో బ్రెజిల్ వ్యవహరిస్తున్న తీరు భయానకంగా ఉందని అన్నారు. ప్రజల కోసం పోరాడడమే ఆయన చేసిన నేరమంటూ ఆక్రోశించారు. దీనిపై లూలా కూడా దీటుగానే స్పందించారు. ప్రపంచం మారిపోయిందని ట్రంప్ తెలుసుకోవాలని చురక వేశారు. మనకు చక్రవర్తి అవసరం లేదని ఎద్దేవాచేశారు. ఇది జరిగిన రెండు రోజులకు బ్రెజిల్‌పై ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలు విధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా పరిశ్రమలపై సుంకాలు విధించే అవకాశాలను బ్రెజిల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్రెజిల్, అమెరికా మధ్య ప్రస్తుతం బలమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అంతర్జాతీయ టారిఫ్ యుద్ధంలో బ్రెజిల్ విజేతగా నిలిచింది. బ్రెజిల్ నుంచి అమెరికా మార్కెట్‌కు మాంసం ఎగుమతులు రెట్టింపయ్యాయి. గత ఐదు నెలల కాలంలో కాఫీ ఎగుమతులు 40 శాతం పెరిగాయి.
బోల్సొనారోను కాపాడేందుకే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES