Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeచౌరస్తాకనడమా? కొనడమా?

కనడమా? కొనడమా?

- Advertisement -

రాజు రాజసింహాసనం మీద కూచుని వున్నాడు. మంత్రి తన ఆసనంలో, సేనాపతి, కొశాధిపతీ, ఇతర అధికారులు తమ తమ ఆసనాల్లో కూచుని వున్నారు. ఏదో ఒక విషయం మీద గంభీరమైన చర్చ జరుగుతున్నది. సడన్‌గా రాజు ఎదుటకి వచ్చి తలవంచుకు నిలబడ్డాడు ఓ భటుడు. సభలో మాటలు ఆగినయి. ఏమిటన్నట్టు బొమ్మలు ముడివేశాడు మంత్రి. కళ్లు ఎగరేశాడు రాజు.
‘మహాప్రభూ! తమ దర్శనం కోసం ఓ వనిత ద్వారం దగ్గర వెయిట్‌ చేస్తున్నది. తమరి ఆర్డర్‌ అయితే…’ అంటూ నసిగాడు భటుడు.
‘ఎవరా స్త్రీ?’ అన్నాడు రాజు. ‘విజిటింగ్‌ కార్డేమైనా ఇచ్చిందా?’ అన్నాడు మంత్రి.
‘లేదు ప్రభూ. ఆమె ఒక బాబును ఎత్తుకుని వున్నది. ఆమె కొడుకేమోననిపించింది. తమరు….’ భటుడి నోటి వెంట వాక్యం పూర్తికాకమునుపే…
‘ఎవరయితేనేం. ఒక స్త్రీ అంటున్నాడు. పైగా బిడ్డడిని ఎత్తుకుని వుందంటున్నాడు ప్రభూ. స్త్రీలను గౌరవించడం తమకు కీర్తినే తెచ్చిపెడ్తుంది. ప్రవేశపెట్టమనండి’ అన్నాడు సేనాపతి.
ఆ స్త్రీ లోపలికి వచ్చింది. పండంటి మగబిడ్డను ఎత్తుకుని వుంది. ఏదో రుషి ఆశ్రమం నుంచి వచ్చినట్టు ఆమె వస్త్రాలు తెలియజేస్తున్నవి.
‘ఎవరమ్మా, ఎవరు నీవు? నీ సమస్య ఏమిటో చెప్పు. ప్రజల సమస్యల్ని తీర్చడమే ప్రభువుల తక్షణ కర్తవ్యం’ అన్నాడు మంత్రి.
‘అవును. అదే మా తక్షణ కర్తవ్యం!’ అన్నాడు రాజు. ఆమె తల ఎత్తింది. చుట్టూ చక్రాల్లాంటి కళ్లు తిప్పింది. చివరగా చూపును రాజు మీద నిలిపింది. రాజు తనను ఓ అపరిచిత స్త్రీలా చూస్తున్నట్టు గ్రహించింది. ‘మహారాజా! నేను.. నన్ను గుర్తించలేదా?’ అంది. ఆమె గొంతు జీరబోయింది. రాజు ముందుకు వంగి ఆమె వైపు పరీక్షగా చూసి… ‘ఎవరునువ్వు? నిన్ను నేను ఎప్పుడూ చూడలేదే?’ అన్నాడు.
ఆమె గుండె వేగం హెచ్చింది. నుదుటిమీద చెమట బిందువులు గుమిగూడినవి.
‘మహారాజా! నన్ను మీరు ఎప్పుడూ చూడనేలేదా? అబద్దం! గుర్తుచేసుకోండి. నేను మీ పత్నిని, మీ భార్యని, మీ వైఫ్‌ని’ అందామె అయోమయంగా మాటలు తడబడుతూ.
రాజు ఉలిక్కిపడ్డాడు. సింహాసనంలో కూర్చుండలేక లేచి నిలబడ్డాడు. కోపంతో ముఖం ఎర్రబడింది. ”ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదైనా సమస్య వుంటే చెప్పు, పరిష్కరిస్తా. కానీ నువ్వే నాకు సమస్యవైతే ఎలా? ఊరుకుంటే నువ్వు ఎత్తుకున్న ఆ అబ్బాయి నా కొడుకు అనేట్టున్నావు’ అని అరిచాడు రాజు కోపంగా.
‘అవును. తమరు అన్నమాట నిజం. ఈ బాబు మీ బాబు మీ బాబు. ఈ బాబుకు మీరే బాబు’ అన్నదామె. రాజు గారితో సహా సభలో అందరి ముఖాలు తెల్లబోయి తెల్లబడ్డాయి. ముందుగా తేరుకున్న మంత్రి ఆమె దగ్గరకు వచ్చి ‘ఏమిటమ్మా నీ సమస్య. ఆయన ఎవరనుకున్నావు? మహారాజు. నీవు చూస్తే ఆశ్రమవాసివి. మీ ఇద్దరికీ ఎక్కడ కుదురుతుందమ్మా. అసలాయన నిన్ను ఎప్పుడూ చూసి వుండే అవకాశమే లేదు’ అన్నాడు. ఆమె కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటూ ‘నేను అబద్దం చెప్పడం లేదు. కొన్నాళ్ల కిందట వారు అరణ్యంలో వేటకు వచ్చినప్పుడు మా ఆశ్రమానికి వచ్చారు. నన్ను పెళ్లాడారు. దైవ ప్రమాణంగా చెప్తున్నా. ఈ పసివాడు ఆయన పుత్రుడే’ అందామె.
మంత్రి రాజు ముఖంలోకి చూశాడు. రాజు తనకేమీ తెలియదన్నట్టు పై కప్పువైపు చూశాడు. సేనాపతి ముందుకు వచ్చాడు.
‘అమ్మా… అబద్దం చెప్తే రాజదండన తప్పదు. నువ్వు చెప్పింది నిజమనడానికి సాక్ష్యం ఏమైనా వుందా?’అనడిగాడు. ఆమె ‘వుంది.. వుంది..’ అంటూ చేతి వేలు వైపు చూసుకుంది. తర్వాత ‘అది వుంది… వుండేది… కాని ఇప్పుడు లేదు, నదిలో వస్తున్నప్పుడు నీటిలో జారి పడిపోయిందేమో. దేవుదా! ఇప్పుడెలా?’ అంది ఆమె చేతులెత్తి కనపడని దేవుడికి నమస్కరిస్తూ.
‘వెళ్లు వెళ్లవమ్మా! పిచ్చిదానిలా వున్నావు! రాజవైద్యుని సంప్రదించు. నీ తిక్క కుదురుస్తాడు’ అంటూ సేనపతి ఒరలో వున్న కత్తి పిడిని ఒత్తి పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడు రక్షక భటులు ఒక చేపలు పట్టేవాడ్ని రాజు ముందుకు లాక్కువచ్చిరు. కొత్వాలు ముందుకు వచ్చి వివరణ ఇచ్చాడు.
‘మహాప్రభూ! ఈ చేపలు పట్టేవాడు రాజముద్రిక వున్న వుంగరాన్ని అంగట్లో అమ్మబోతుంటే నాలుగు తగిలించి పట్టుకువచ్చాం’ అంటూ రాజముద్రికను మంత్రికిచ్చాడు. మంత్రి దాన్ని అందుకుని ‘ఎక్కడిదిరా నీకిది?’ అని బిగ్గరగా అరవడంతో బిక్కసచ్చిన చేపలు పట్టేవాడు వణుకుతూ ‘నేను వలవేసి పట్టుకున్న ఓ చేప కడుపులో వున్నది మారాజా! సత్యప్రమాణకంగా చెప్తున్నా’ అన్నాడు తలమీది అరచేయి ఆనించి. మంత్రి రాజముద్రిక వున్న వుంగరాన్ని రాజుకు అందించాడు. రాజుకు దాన్ని చూసీ చూడగానే గతం గుర్తుకు వచ్చింది. రాజు మెట్లు దిగి వచ్చి ఆ స్త్రీవైపు చూస్తూ ‘గుర్తుకు వచ్చింది. అంతా గుర్తుకు వచ్చింది. వీడు నా కొడుకే. వీడి బాబు వేరెవడో కాదు, నేనే’ అంటూ బాబును ఎత్తుకున్నాడు.
డి.ఎన్‌.ఎ. టెస్టు జరగకుండానే నిజం నిగ్గుతేలింది. ఒక కథ సుఖాంతమైంది. ఒక వనిత తన భర్తను, ఒక బాబు తన నిజమైన బాబును చేరుకోగలిగాడు.
సత్యకాలం పోయి ఇప్పుడు కలికాలం అని పిలవబడే పిదపకాలం వచ్చింది కదా. ఆ కాలంలో సంతానం కోసం వరాలిచ్చే రుషులూ, మునులూ, మహాపురుషులూ వుండేవారట. ఇప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నవి సంతాన సాఫల్య కేంద్రాలు. పరీక్షలంటూ, వైద్యమంటూ ప్రయోగాలంటూ అవసరం కోసం వచ్చినవాళ్లను పిచ్చోళ్లను చేసి ముక్కూ చెవులూ పిండి వసూలు చేస్తున్న వైద్య వ్యాపారులున్నారు. మరి ఎవరి బిడ్డలు వారికేనా నిజంగా?
‘డాక్టర్‌! డాక్టర్‌! ఇదిగో మీరడిగిన డబ్బు. తల తాకట్టు పెట్టి తెచ్చాను. మా బాబును మాకిప్పించండి’
‘డాక్టర్‌! డాక్టర్‌! వీడు నిజంగా మావాడేనా. స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి గుడి మెట్లమీద కూచుని అమ్మా! అయ్యా అని అడుక్కుంటున్నాడు’
‘అసలు వీడికి మా పోలికే లేదండి డాక్టర్‌. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. జరిగిందా?’
సంతానాన్ని నిజంగా సైన్సు సృష్టిస్తోందా లేక బిడ్డల్ని కనలేని వాళ్ల కోసం అంగట్లో బిడ్డల్ని కొని ఆసుత్రుల్లో అమ్మేస్తున్నారా?

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img