నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 61వ వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, నెహ్రూ మునిమనవడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నెహ్రూ స్మారక చిహ్నం శాంతివన్ వద్ద కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పుష్పాంజలి ఘటించారు.
‘భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళులు. బలమైన సమగ్ర భారతదేశం అనే కలతో నెహ్రూజీ తన దార్శనిక నాయకత్వంతో స్వతంత్ర భారతదేశానికి బలమైన పునాది వేశారు. సామాజిక న్యాయం, ఆధునికత, విద్య, రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్థాపనలో ఆయన చేసిన కృషి అమూల్యమైనది. నెహ్రూ వారసత్వం, ఆదర్శాలు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాయి’ అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నెహ్రూ వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సహకారం లేకుండా 21 శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేం అని అన్నారు. ‘నెహ్రూ ఆధునిక భారతదేశ సృష్టికర్త. ప్రజాస్వామ్యానికి నిర్భయ సంరక్షకుడు, భారతదేశాన్ని సున్నా నుండి శిఖరానికి తీసుకెళ్లిన వ్యక్తి. భారతదేశాన్ని శాస్త్రీయ, ఆర్థిక, పారిశ్రామిక వివిధ రంగాలలో అభివృద్ధి చేసిన వ్యక్తి. భిన్నత్వంలోనే ఏకత్వం అనే సందేశాన్ని నిరంతరం అందించిన వ్యక్తి. ఆయన సహకారం లేకుండా 21వ శతాబ్దపు భారతదేశాన్ని ఊహించలేము’ అని ఖర్గే ఎక్స్ పోస్టులో తెలిపారు. ‘నెహ్రూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం అనే ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాయి’ అని కాంగ్రెస్ ఎక్స్ పోస్టులో ఆయనకి నివాళులర్పించింది.