నవతెలంగాణ-హైదరాబాద్ : యూఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ ‘నిసార్’ ప్రయోగం బుధవారం జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 5:40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. నిసార్ అనేది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి భూమిని పరిశీలించే ఉపగ్రహం. దీని బరువు 2,392 కిలోలు ఉంటుంది. దీనిని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉంచనున్నారు.
ఈ ఉపగ్రహం భారత్, అమెరికాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండగా భూమికి సంబంధించిన వివరణాత్మక చిత్రాలను పంపనుంది. శాటిలైట్ ప్రతి12 రోజులకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలానికి సంబంధించిన ఫొటోలను తీయనుంది. దీని నుంచి పొందిన డేటాతో భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటం, వ్యవసాయం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ ఉపగ్రహం నుంచి వచ్చే అధిక రిజల్యూషన్ చిత్రాలు హిమానీనదాలను పర్యవేక్షించడంలో భారత్, అమెరికా ప్రభుత్వాలకు సహాయపడతాయి. చైనా, పాకిస్తాన్‌లతో భారతదేశ సరిహద్దులను నిశితంగా పరిశీలించడంలోనూ దోహదపడనున్నాయి. ఈ మిషన్ 5 సంవత్సరాలు పనిచేయనుండగా దీని నుంచి సేకరించిన డేటా ఉచితంగా అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది.