రాత్రి తొమ్మిదయింది అందరూ టీవీలు పెట్టుకొని శంఖం ఛానల్‌లో వార్తలు వింటున్నారు. నీలం ప్యాంటు, నీలం కోటు వేసుకొని టై పెట్టుకొని ట్రంపుట్రంపుమని అధ్యక్షులవారు నడిచొస్తున్నారు. అక్కడి టీవీ విలేకరులంతా తమ తమ కెమేరాలు సిద్ధం చేసుకొని చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ఇంతలో శంఖం టీవీ యాంకర్ ఓసారి శంఖం గట్టిగా ఊది ”నేటి సుంకాలు” అన్న శీర్షికన ఇప్పుడు ప్రపంచా ధ్యక్షులవారు మన దేశం మీద విధించబోయే సుంకాల గురించి చెబుతారు. ఆయన చేతిలో పెద్ద బోర్డ్ ఉంది చూడండి అదే సుంకాల బల్ల. బాగా చూడండి దాన్ని అడ్డు, నిలువు గీతలున్నాయా, ఆ ఉన్నాయి కదా, అదీ రకరకాల రంగుల్లో ముందే రాసివున్న అక్షరాలు, అంకెలు ఉన్నాయి. వినండి వారి మాటల్ని అని మరోసారి శంఖం ఊది అధ్యక్షులవారు ట్రంప్ గారిని చూపిస్తారు.
”ఈరోజు విధిస్తున్న సుంకాలేమనగా సుగంధ ద్రవ్యాలు, చేనేత బట్టలు, బొమ్మలు, రెడీమేడ్ దుస్తులు, స్వర్ణాభరణాలు ఇంకా ఇలాం టివే ఎన్నో, ఈ బోర్డ్‌లో ఉన్నాయి చదూకొండి. మొదట విధించిన ఇరవై ఐదు శాతం సుంకానికి అదనంగా మరో ఇరవై ఐదు శాతం కలుపుతున్నాను” ప్రపంచాధ్యక్షులు అనుకునేలా, అంతా నా ఇష్టం అన్నట్టు తెగేసి చెప్పినారు ట్రంపులవారు.
”మళ్లీనా, మరో ఇరవై ఐదు శాతమా? ఇక్కడున్న భారతీయుల సంతతికి నష్టమే కాదు కష్టం కదా” ఒక విలేకరి
”నష్టం కష్టం జాన్‌తా నై!! సుంకాలు పెట్టినప్పుడంతా చెబుతున్నానుగా, రష్యాతో మైత్రికి కటీఫ్ పెట్టుకొని వస్తే మాట్లాడతాం లేకుంటే లేదు. అటు నుండి మౌనం, అది నా మీద మర్యాదతోనో, భయంతోనో కొనసాగించినా, నాకు మాత్రం మౌనంగా ఉండడం తెలీదని గ్రహించాలి వాళ్ళు, అంటే భారతదేశ నాయకులు”
”ఇలా ఎంత కాలమని?నెహ్రూ కాలం నాటినుండి వారి మైత్రి ఉందికదా, ఇప్పుడొద్దంటే ఎలా” ఇంకో విలేకరి
”అది నా చేతుల్లో లేదు, నా నోట్లోనూ లేదు. ప్రస్తుతమున్న ఉద్రిక్తత తగ్గినాకనే ఇండియాతో మాటలు అంతవరకూ మౌనం అంటే ఆ తగ్గిం చడం పై మాత్రమే మౌనం పెంచే విషయంలో మౌనమే లేదు నా వైపు నుండి గొంతు వినిపిస్తూ ఉంటుంది పెంచినప్పుడల్లా. అయినా నెహ్రూ అన్న మాట వింటేనే మండిపడుతున్నవాళ్లు, నెహ్రూ మొదలుపెట్టిన రష్యాతో మైత్రిని వదిలేసి రావలా లేదా? మీరే చెప్పండి”
”ఉద్రిక్తత అంటున్నారు అటువైపునుండి నింపాదిగా చూస్తూ ఉన్నారు నాయకులు, మీరు కాస్త ఉద్రిక్త, ఉద్విజ్ఞ స్థితిలో ఉన్నట్టున్నారు” మరో విలేకరి అడిగాడు.
”వారు మౌనం విషయంలో పేటెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఐనా ప్రపంచంలో ఏ హక్కులు ఎవరికి కావాలన్నా ఇవ్వవలసింది నేను, అది మరిచిపోతే ఎలా” కాస్త కోపానికి లోనయ్యారు అధ్యక్షులవారు.
”రష్యానుండి ఆయుధాలు, చమురు తెప్పించుకుంటే మన వ్యవస్థకొచ్చిన ముప్పు ఏమీ లేదు కదా? ఆరకంగా చూస్తే మనం పాకిస్తానుతో ఇంకొన్ని దేశాలతో స్నేహంగా ఉన్నాం కదా అలా ఉండకూడదని ఎవరైనా షరతులు పెడితే?” సత్యాలు మాట్లాడాడు ఇంకో విలేకరి
మొహమంతా చిటపటలాడించి ముక్కుమీద కోపం చూపించి అధ్యక్షులవారన్నారు ”ఓ పిచ్చి విలేకరీ ఎవరు ఎవరితో స్నేహంగా ఉండాలో, శత్రువులుగా ఉండాలో నిర్ణయించవలసింది నేను, తెలుసుకో. అలాగే ఎవరినుండి ఏ సరుకులు కొనాలి అన్నది కూడా నా శాసనమే”
”ఇది జరిగేపనే అనుకుంటున్నారా?”
”నేను మళ్లీ కుర్చీ ఎక్కుతానని నువ్వనుకున్నావా? అసలెవరైనా అనుకున్నారా? ఇదీ
”ఈ వయసులో మీకివన్నీ అవసరమా, అవసరమా అధ్యక్షా అనడుగుతున్నాను?” ఎప్పటినుండొ ఈమాట అనాలని చూస్తున్న విలేకరి ఒకరు అడిగారు.
”వయసుదేముంది మిత్రమా? వయసుకీ రిటైర్మెంటుకీ సంబంధమే లేదు. మనం దిగిపోయేవరకు ఉండాలా లేదా అన్నది మన ఇష్టం. ఇండి యాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచుతూనే ఉన్నారని తెలిసింది. అందుకే ఇకపై నన్ను ముసలోడు, వయసైపోయినోడు అంటే బాగుండదు తెలుసుకొండి”
”కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉండి, మీ పౌరసత్వం తీసుకొని మరీ మీకు ఆదాయం కలిగిస్తున్న భారతీయులకు సుంకాల భారం పడుతోంది కదా, వాళ్లకు మీ మీద కోపం రాదా” ఓ యువ విలేకరి ప్రశ్న
కొద్దిగా నీళ్లు తాగి మొదలుపెట్టారు ట్రంపులవారు ”నీళ్లు తాగుతున్నాను అంటే భయపడ్డానని రాసుకునేరు, చెప్పేరు. నేను తాగడం కాదు నీళ్లు వారితో తాగించాలన్నదే నా ప్రయత్నం. ఇక నేటికింతే, మిగతావాటి గురించి రేపు చెబుతాను” అని పక్కనున్న పీయే వైపు చూశాడాయన. పీయే శంఖం తీసి ఒకసారి దాన్ని ఊపి విలేకరుల సమావేశం ముగిసిందన్నట్టు ప్రకటించాడు.
రెండోసారి అధ్యక్షుడైనట్టు పెట్టేసిన మైకు మళ్లీ తీసుకొని ”నా మీద భారతదేశంలో జోకులు పేలుస్తున్నారట. ముఖ్యంగా తెలుగువాళ్లు ట్రంపరితనమని, ట్రంపహ, ట్రంపస్య, ట్రంపోభ్యహ అనీ ఇంకా ఏవేవో రాస్తున్నారట. నేనవన్నీ గూగుల్ ట్రాన్స్లేటర్‌లో అనువాదాలు చూసుకుంటున్నాను. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి”
ఇంతలో ఓ విలేకరి ఫోను రింగయింది, తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా అన్న పాట వస్తోంది. ట్రంపులవారికి కోపం అధికంగానే వచ్చింది
”పీయే ఆ పాట గురించి కనుక్కో”
”నాకు తెలుసు సార్ అది అల్లూరి సీతారామరాజులోని పాట మహాకవి శ్రీశ్రీ రాసింది. రామరాజు ఆ బ్రిటిష్ వారికే భయపడలేదు. ఇక మీకెవరు భయపడతారు చెప్పండి” ”…!!!???”
జంధ్యాల రఘుబాబు
9849753298