నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాతో వాణిజ్యం చేసే ఏ దేశంపైనైనా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచే చర్యలను కాంగ్రెస్ ఆమోదించాల్సిన సమయం ఆసన్నమైందా అని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ చట్టాన్ని ఆమోదిస్తోందని, రిపబ్లికన్లు చట్టాన్ని తీసుకువస్తున్నారని అన్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా చాలా కఠినమైన ఆంక్షలు విధిస్తామని, ఇరాన్‌పై కూడా విధించవచ్చని అన్నారు.
రష్యన్ చమురు ద్వితీయ కొనుగోళ్లు పున: విక్రయంపైప 500శాతం సుంకాన్ని ప్రతిపాదించే బిల్లును సెనెటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనకు సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. గ్రాహం మరియు సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటల్ సంయుక్తంగా 2025 నాటి రష్యా నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది ”ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడం కొనసాగించే దేశాలపై” ద్వితీయ సుంకాలు, ఆంక్షలు విధిస్తుంది. ప్రతిపాదిత చట్టానికి సెనెట్‌లో 85మంది సభ్యులు ఆమోదం తెలిపారు.
అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య రక్తపాతాన్ని ముగించేందుకు ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తూ.. శక్తివంతమైన చర్య తీసుకున్నారని గ్రాహం, బ్లూమెంటల్ జులైలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి అంతిమ చర్య చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధించడం. ఇవి చౌకైన రష్యన్ చమురు, సహజవాయువులను కొనుగోలు చేయడం ద్వారా పుతిన్ యుద్ధానికి ఆసరగా నిలబతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.



