నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరభారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో వరదల ధాటికి రవాణ వ్యవస్థ విధ్వంసమైంది. పలు ప్రాంతాల్లో వరదల ఉధృతికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు మార్గాలు దెబ్బతిన్నాయి. నందప్రయాగ్-ఉమట్టా ప్రాంతాల సమీపంలో రోడ్లపై శిథిలాలను అధికారులు తొలగించిన బద్రీనాథ్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ స్థాయిలో మట్టిపెల్లాలు, బండరాళ్లు పడిపోవడంతో ఆయా మార్గాలు అస్తవ్యస్తంగా మారాయి. కొంతమేరకు అధికారులు మరమ్మతులు చేసినా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటుగా వెళ్లే మార్గాల్లో రాకపోకలు నత్తనడకన సాగుతున్నాయని, తీవ్ర ట్రాఫిక్ జాం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నాలుగు జిల్లాలకు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ హై-అలర్ట్ జారీ చేసింది. టెహ్రీ, ఉత్తరకాశి, రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.